Harry Brook missing IND vs IND Test Series: భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. కీలకమైన మిడిలార్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు బ్రూక్ దూరమవుతున్నట్లు ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆదివారం తెలిపింది. బ్రూక్ స్థానంలో డాన్ లారెన్స్‌ను ఈసీబీ ఎంపిక చేసింది. బ్రూక్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అలాంటి ప్లేయర్ జట్టుకు దూరమవడం ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బే అని చెప్పాలి.
హ్యారీ బ్రూక్ స్థానంలో ఎంపికయిన డాన్ లారెన్స్ ఇంగ్లండ్ తరఫున 11 టెస్టులు ఆడి 551 పరుగులు చేశాడు. జనవరి 25న హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ టెస్టు కోసం ఆదివారం ఇంగ్లండ్ జట్టు హైదరాబాద్‌కు చేరుకుంది. విశ్రాంతి అనంతరం నేడు ఉప్పల్ మైదానంలో ఇంగ్లీష్ జట్టు ప్రాక్టీస్ చేయనుంది.
Also Read: IND vs ENG: విరాట్ కోహ్లీని స్లెడ్జ్ చేయండి.. ఇగోతో మైండ్ గేమ్ ఆడండి!
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో ఇంగ్లండ్‌కి ఇది రెండో టెస్ట్ సిరీస్. 2023 యాషెస్‌లో ఆస్ట్రేలియాపై 2-2తో డ్రా చేసుకుంది. దాంతో ఈ టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ జట్టుకు కీలకం కానుంది. భారత్‌లో తమ చివరి రెండు టెస్ట్ సిరీస్‌లను ఇంగ్లండ్ కోల్పోయింది. 2020/21లో 1-3తో ఓడిపోయిన ఇంగ్లండ్.. 2016/17లో 0-4తో కోల్పోయింది. అంతకుముందు 2012/13లో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆతిథ్య భారత జట్టును 2-1 తేడాతో ఓడించింది.