NTV Telugu Site icon

Harmanpreet Kaur: భారత క్రికెట్‌కు చెడ్డ పేరు వచ్చింది.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: మదన్ లాల్

Harmanpreet Kaur

Harmanpreet Kaur

Madan Lal Says Take strict disciplinary action against Harmanpreet Kaur: భారత మహిళల జట్టు కెప్టెన్‌, సీనియర్‌ బ్యాటర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌పై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. హర్మన్‌ప్రీత్‌ ప్రవర్తన సరిగ్గా లేదంటూ అందరూ మండిపడుతున్నారు. ఇందులో భారత మాజీ క్రికెటర్ కూడా ఉన్నారు. హర్మన్‌ప్రీత్‌ వలన భారత క్రికెట్‌కు చెడ్డ పేరు వచ్చిందని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు మదన్ లాల్ బీసీసీఐకి సూచించారు. బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో, మ్యాచ్‌ తర్వాత హర్మన్‌ హద్దు మీరి ప్రవర్తించడమే ఇందుకు కారణం.

ఢాకా వేదికగా భార‌త్, బంగ్లాదేశ్ మ‌హిళ‌ల జ‌ట్ల మ‌ధ్య శనివారం జ‌రిగిన నిర్ణయాత్మక మూడో వ‌న్డే టైగా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో 225 పరుగులు చేయగా.. లక్ష్య చేధనలో భారత్ సరిగ్గా 225 పరుగులకు ఆలౌటైంది. విజయానికి ఒక పరుగు అవసరం కాగా.. హర్మన్‌ప్రీత్‌ సేన చివరి వికెట్ కోల్పోయింది. అంపైర్లు ‘సూపర్ ఓవర్’ నిర్వహించకుండానే ఇరు జట్లను సంయుక్త విజేత‌లుగా (1-1) ప్ర‌క‌టించారు. ఈ మ్యాచ్‌లో అంపైర్ల త‌ప్పిదాలు భారత్ విజ‌యావ‌కాశాల్ని దెబ్బ‌తీశాయి.

మూడో వన్డే మ్యాచ్‌లో భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్‌ కోపంతో ఊగిపోయింది. భారత ఇన్నింగ్స్‌ 34 ఓవర్‌‌ను బంగ్లా బౌలర్ నహిదా అక్తర్‌ వేసింది. ఆ ఓవర్‌‌లోని మూడో బంతిని హర్మన్‌ప్రీత్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి ప్యాడ్‌కు తాకింది. బంగ్లా ప్లేయర్స్ ఎల్బీడబ్ల్యూకి అప్పీలు చేయగా.. అంపైర్‌ వెంటనే ఔట్‌ అంటూ వేలు ఎత్తేశాడు. హర్మన్‌ ఔటే కానీ.. బౌలర్‌ అప్పీల్‌ చేయడమే ఆలస్యం ఔట్‌ ఇచ్చేందుకు అంపైర్ సిద్ధంగా ఉన్నట్లు వ్యవహరించడం హర్మన్‌కు కోపాన్ని తెప్పించింది. దీంతో స్టంప్స్‌ను బ్యాట్‌తో కొట్టి.. అంపైర్ల వైపు సంజ్ఞలు చేస్తూ, ఏవో మాటలంటూ బయటకు వెళ్లింది.

Also Read: Lectrix EV Scooter Launch: ఎథర్‌, ఓలాకు పోటీగా.. మార్కెట్‌లోకి సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌!

హర్మన్‌ప్రీత్ కౌర్‌ మైదానం వీడుతూ అంపైర్‌‌ను బండ బూతులు తిట్టినట్లు పలు వీడియోల్లో కనిపిస్తోంది. అంతేకాదు ఆమె పెవిలియన్‌‌కు వెళ్తున్న సమయంలో బంగ్లా అభిమానులు రెచ్చగొట్టగా.. వారికి అసభ్యకరంగా బొటన వేలు చూపించింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. యాస్తిక ఎల్బీ, మేఘన క్యాచ్‌ విషయంలోనూ అంపైర్ల తీరు బాగాలేదని హర్మన్‌ప్రీత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మ్యాచ్‌ ముగిశాక అంపైర్ల తీరుపై హర్మన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంపైరింగ్‌ పేలవంగా ఉందని, మరోసారి బంగ్లా పర్యటనకు వచ్చేముందే ఇలాంటి అంపైరింగ్‌కు సన్నద్ధమయ్యే వస్తామని పేర్కొంది. ట్రోఫీ ప్రదానోత్సవం తర్వాత రెండు జట్ల ఉమ్మడి ఫొటో సమయంలోనూ బంగ్లా క్రికెటర్లను అవమానపరిచేలా మాట్లాడినట్లు వెల్లడైంది.

హర్మన్‌ప్రీత్ కౌర్‌ తీరుపై ఐసీసీ చర్యలు తీసుకుంది. మ్యాచ్‌ ఫీజులో 75 శాతం జరిమానాతో పాటు 3 డిమెరిట్ పాయింట్లు కూడా కేటాయించింది. భారత మాజీ ఆటగాడు మదన్ లాల్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ ఆమెపై చర్యలు తీసుకోవాలి బీసీసీఐని కోరారు. ‘బంగ్లాదేశ్ మహిళల జట్టుపై హర్మన్‌ప్రీత్ కౌర్‌ ప్రవర్తన క్షమించరానిది. ఆమె క్రికెట్ ఆట కంటే పెద్దది కాదు. హర్మన్‌ప్రీత్ వల్ల భారత క్రికెట్‌కు చాలా చెడ్డ పేరు వచ్చింది. బీసీసీఐ కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.

Also Read: IND vs WI: టెస్టు క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత్!