Harish Rao: పాశమైలారం పరిశ్రమ పేలుడు ఘటనపై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్బంగా ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. నేడు జరిగిన పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదంలో గాయపడినవారిని పరామర్శించేందుకు హరీష్ రావుతో పాటు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రావు కలిసి పటాన్ చెరులోని ధ్రువ ఆసుపత్రిని సందర్శించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరిస్థితిని పరిశీలించారు.
Read Also:Reactor Blast: భారీ క్రేన్ లతో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..!
ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదం జరిగి ఐదు గంటలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 150 మంది వరకు కార్మికులు ఉన్నారని, అయితే ఇప్పటివరకు 60 మంది ఆచూకీ లభించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. అస్పత్రిలో 11 మంది గాయపడినవారు చికిత్స పొందుతుండగా.. వీరిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్నారు. వెంటనే మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని.. దీనికోసం జిల్లాకు చెందిన ఎస్పీ, కలెక్టర్ లను ఫోన్ ద్వారా సంప్రదించి.. పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
Read Also:Chirag Paswan: బీహార్ ఎన్నికల్లో పోటీపై కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ కీలక ప్రకటన
అంతేకాకుండా, ఈ ఘటనలో మరణించిన కార్మిక కుటుంబాలకు తక్షణమే రూ. కోటి ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వంను ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలు తమ బంధువుల ఆచూకీ లేక ఆందోళనకు గురవుతున్నాయని తెలిపారు. పరిశ్రమల భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని హరీష్ రావు ధ్వజమెత్తారు.
