తెలంగాణ భవన్‌లో మాజీమంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. బనకచర్ల అంశం, సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పైన మాట్లాడారు. నిన్న సీఎం రేవంత్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు అని పేర్కొన్నారు. బేసిన్ల గురించి సీఎంకు మినిమం అవగాహన లేదనిమండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రాజెక్టులను అడ్డుకున్నారని, అవన్నీ ప్రజంటేషన్‌లో ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. తమ పార్టీ సచ్చిన పామే అయితే.. పదే పదే బీఆర్ఎస్ పేరెందుకు ప్రస్తావిస్తున్నారన్నారు. తమకు తెలంగాణ రాష్ట్ర హక్కులే ముఖ్యమని హరీష్ రావు చెప్పుకొచ్చారు.
‘రాజ్యాంగ పదవిలో ఉన్న మన సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారు. రాజకీయాలు కేంద్రంగా బురద జల్లడమే పనిగా మాట్లాడుతున్నారు. నిన్న ప్రగతి భవన్‌లో పెట్టిన ప్రజంటేషన్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాత్రమే ఎందుకు పిలిచారు. అందరిని పిలిస్తే బాగుండేది. ఈ పీపీటీ అమరావతిలో తయారు చేసినట్లుగా ఉంది. చంద్రబాబు తరుపున రేవంత్ రెడ్డి ప్రజంటేషన్ ఇచ్చినట్లుగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఎన్నో తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు ఆపే ప్రయత్నం చేశారు. ఆ విషయాలు ఎందుకు చూపించలేదు. కేసీఆర్ పేరు ఎత్తకుండా ఈ సీఎం ఒక్క మీటింగ్లో కూడా మాట్లాడలేడు. అహంకారంతో ప్రజలు అదఃపాతాళానికి తొక్కుతారు. బనకచర్ల మీద బొంకుడు రాజకీయాలు పక్కన పెట్టు’ అని ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించారు.
Also Read: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. మరలా పెరిగిన బంగారం ధరలు!
‘చంద్రబాబుతో ఉన్న అనుబంధం మన సీఎం మరిచిపోలేకపోతున్నారు. గత సంవత్సరం జులై 6న చంద్రబాబును ప్రజా భవన్‌కు పిలిచారు. ఆరోజే బనకచర్లకు పునాది పడింది. 2024 సెప్టెంబర్ 13 బెజవాడ వెళ్లి.. బజ్జీలు తిని ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచర్లకు లైన్ క్లియర్ చేశాడు. నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు డబ్బులు ఇవ్వమని లేఖలు రాశారు. అపెక్స్ లేఖలో లేని విషయాలు చెబుతున్నారు. రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుందాం అని ఉంది. ఆమోదయోగ్యమైన మీటింగ్ ఏపీ ప్రభుత్వంతో జరుగలేదు. మా హయాంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 2016లో బనక చర్ల రాసి ఇచ్చాము అని తప్పుడు మాటలు చెబుతున్నారు. ఈ మీటింగ్ మినిట్స్లో పెన్నా నది పేరు ఎక్కడైనా ఉందా. దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టు నీ బట్టలు విప్పుతాం’ అని హరీష్ రావు సవాల్ చేశారు.
