NTV Telugu Site icon

Harish Rao : వంద కాదు 180 రోజులైనా 6 గ్యారంటీలకు దిక్కులేదు

Harish Rao

Harish Rao

తొర్రూరులో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో ఆలోచనలు కల్పించి మభ్యపెట్టిందని, బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పై పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలన్నారు. 6 గ్యారంటీలు 13 హామీలు వంద రోజుల్లో అమలు చేస్తామని మోసం చేశారని, వంద కాదు 180 రోజులైనా 6 గ్యారంటీలకు దిక్కులేదన్నారు హరీష్‌ రావు. నిరుద్యోగ భృతి రాలేదు, ఉద్యోగాలు రాలేదని, చేసేది లేక దేవుళ్ళ మీద ఒట్లు పెడుతున్నరని ఆయన అన్నారు. ఆగష్టు 15 లోగా చెప్పిన హామీలు అమలు చేస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా, మల్లా పోటీ కూడా చెయ్యను అని చెప్పానని, రైతులు, మహిళలు, విద్యార్థుల కోసం నేను సవాల్ విసిరానన్నారు. ఒక్క మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడని, దొడ్డు వడ్లను బోనస్ ఇవ్వము అన్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు హరీష్‌ రావు.

అంతేకాకుండా..’రైతుల చెవుల్లో పువ్వులు పెడుతున్నడు. ఒక్క ఉద్యోగం కూడా ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇచ్చి పూర్తి చేయలేదు. 30 వేల కెసిఆర్ ఉద్యోగాలను కాంగ్రెస్ వే అని ప్రచారం చేసుకున్నారు. వంట అయిపోయిన తర్వాత వచ్చి గరిటె తిప్పినట్లుంది కాంగ్రెస్ పరిస్థితి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మరో ఆర్నెల్ల సమయం మాత్రమే ఉంది. చెప్పినట్లుగా ఉద్యోగాలు ఇవ్వకుంటే నిన్ను వదిలిపెట్టరు. నిరుద్యోగులు. వదిలిపెట్టది టిఆర్ఎస్ పార్టీ. మెగా డిఎస్సీ అని మొండి చేయు చూపారు. రూపాయి తీసుకోబోమని పరీక్షల ఫీజులు డబుల్ చేశారు. ఆరు నెలలు అయినా కస్తూర్బా టీచర్లను పర్మినెంట్ చెయ్యలేదు. బయట ఉన్నపుడు మస్తు మాట్లాడాడు.

 

కుర్చీలో కూర్చున్న తర్వాత అర్థం అవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం బండి వెనక్కి పోతున్నది. పథకాలు రద్దు అవుతున్నాయి. కరెంట్ ఫీజులు, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడానికి సిద్ధం అవుతున్నాడు. సామాన్యులకు కోతలు, వాతలు..ఇదే రేవంత్ ప్రభుత్వం అందుకే ఓడగొట్టి సురుకు పెట్టాలి. అసెంబ్లీలో మేము పోరాటం చేస్తం. మండలిలో రాకేష్ రెడ్డి పోరాటం చేస్తారు. జర్నలిస్టులకు రేవంత్ రెడ్డి మొండి చెయ్యి చూపారు. అన్ని శాఖల ఉద్యోగులను వేధిస్తున్నారు. కరెంట్ పోతే విద్యుత్ ఉద్యోగుల తప్పా.. బీజేపీ పాలనలో పేదరికం, నిరుద్యోగం పెరిగింది. పట్టభద్రులు, మేధావులు ఆలోచించాలి. బి ఆర్ ఎస్ అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా.’ అని హరీష్‌ రావు అన్నారు.