కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించారు. అయితే.. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో.. రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రాజ్ నాథ్ సింగ్ ఇక్కడ వచ్చి బాగా మాట్లాడుతున్నారని, బీజేపీది మేకపోతు గాంభీర్యమంటూ హరీష్ రావు సెటైర్లు వేశారు. మీకు పోటీ చేయడానికి నియోజకవర్గాల్లో నాయకులే లేరని, తెలంగాణ విభజన చట్టంలో ఉన్న హామీలను ఇప్పటి వరకు బిజెపి ఎందుకు నేరవేర్చలేదన్నారు. తెలంగాణ కి హక్కుగా రావాల్సిన 1500 కోట్లు ఆపారని, బోరు బావులకు మీటర్లు పెట్టలేదని 35 వేల కోట్లు ఆపారన్నారు హరీష్ రావు.
అంతేకాకుండా.. ‘తెలంగాణ లో ఏం అభివృద్ధి జరగలేదు అని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. మేం అభివృద్ధి చేయకపోతే మా పథకాలను మీరు ఎందుకు కాపీ కొట్టారు. ఢిల్లీలో మాకు అవార్డులు ఇస్తారు..పార్లమెంట్ లో ప్రశంసిస్తారు.. గల్లీలో మాత్రం తిడుతారు. ప్రధాని మోడీ కూడా సీఎం కేసీఆర్ ఎప్పుడు వచ్చినా నీళ్ల గురించి మాట్లాడుతారని స్వయంగా ప్రధాని చెప్పారు. ఓట్లు వచ్చాయని తిడితే మీ మాటలు జనం నమ్మే పరిస్థితి లేదు.
కాంగ్రెస్, బీజేపీ వాళ్ళకి సీట్లు కావాలంటే ఢిల్లీకి పోవాలి, పదవులు కావాలంటే ఢిల్లీకి పోవాలి. చివరికి మీకు ఓట్లు కావాలన్న ఢిల్లీ నుంచి నేతలు రావాలి. రాజ్ నాథ్ సింగ్ కి ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదివి నవ్వుల పాలయ్యారు. స్కీములతో తెలంగాణ ప్రభుత్వం దూసుకెళ్తుంటే కర్ణాటక లో రోజుకో స్కాములో కాంగ్రెస్ పార్టీ లీలలు బయటికి వస్తున్నాయి. 11సార్లు గెలిచిన కాంగ్రెస్ చేయని అభివృద్దిని పదేళ్ళలో సీఎం కేసీఆర్ చేసి చూపించారు.
బీజేపీ హాయంలో సిలిండర్ కొంటేనే కళ్లలోంచి నీళ్లు వస్తున్నాయి. ఆనాడు 300 ఉంటే ధర్నాలు చేసిన బీజేపీ… ఈ రోజు వెయ్యికి పైగా ధరకు ఇస్తుంది. ఏ ప్రభుత్వం కూడా విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం పెట్టలేదు. మేనిఫెస్టోతో ప్రతిపక్షాలు బిత్తరపోయాయి. జనమంతా కారు గుర్తుకే ఓటద్దామని ఫిక్స్ అయ్యి ఉన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసిన హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ దే. కాంగ్రెస్ వాళ్లు టికెట్లు అమ్ముకున్నారని రోజు గొడవలు అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నోట్లకి సీటు అమ్ముకుంటున్నారని వాళ్ల పార్టీ నాయకులే అంటున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీ కొట్టిందని రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాపీ కొట్టింది మీరు..మేము కాదు. రైతు బంధు పెట్టింది ఎవరు..సీఎం కేసీఆర్ కాదా. రైతులు, పెన్షన్ దారులు అందరూ సీఎం కేసీఆర్ వైపే ఉన్నారు. నమ్మకానికి మారు పేరు కేసీఆర్.. నయవంచన కి మారు పేరు కాంగ్రెస్ పార్టీ. రైతు భీమా తరహాలో కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా పథకం కావాలని ఎవరైనా ఆడిగారా.’ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.