Site icon NTV Telugu

Harish Rao : తెలంగాణ సమాజంలో సానుభూతి ఎక్కువ.. అందుకు కాంగ్రెస్‌ గెలిచింది

Harish Rao

Harish Rao

ఎన్టీవీ నిర్వహిస్తున్న క్వశ్చన్‌ అవర్‌ కార్యక్రమంలో నేడు మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు పాల్గొన్నారు. అయితే.. ఈ సందర్భంగా ఎన్టీవీ జర్నలిస్టులు వేసిన ప్రశ్నలకు సమాధానంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు ఏదీ శాశ్వతం కాదు. పత్రిపక్షంలో ఉన్నవాళ్లు అధికారంలోకి వస్తారని ఆయన వ్యాఖ్యానించారు. మా పార్టీ పుట్టింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేయడమని ఆయన అన్నారు.

మేం అధికారంలోకి వచ్చాక కరెంట్‌ సమస్యలు పరిష్కరించామన్న హరీష్‌ రావు.. రాష్ట్రంలో 5 ఉన్న మెడికల్‌ కాలేజీలను 31కి పెంచామని ఉద్ఘాటించారు. అంతేకాకుండా.. వైద్యాన్ని, వైద్యవిద్యను అందుబాటులోకి తెచ్చామని, ఐటీ అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఐటీ ఉత్పత్తులను పెంచాం. కొత్త జిల్లాలు, కొత్త మున్సిపాలిటీలు, కొత్త మండలాలు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.

అయితే.. దొంగ హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిందని ఆయన అన్నారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు పోని కరెంటు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎందుకు పోతోందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌కు అడ్మినిస్ట్రేషన్‌ రావడం లేదని.. ఆ విషయాన్ని వారు ఒప్పుకోరని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా కాంగ్రెస్‌ నేరవేర్చలేదన్నారు. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇప్పటివరకు టీఎస్‌ఆర్టీసీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని హరీష్‌ రావు అన్నారు. మేము ఎన్నికల ముందు బడ్జెట్‌లో పెట్టి ఆర్టీసీ డబ్బునే ఇప్పుడు ఇచ్చారని.. కానీ.. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఎలాంటి నిధులు ఇవ్వలేదన్నారు.

తెలంగాణ సమాజంలో సానుభూతి ఎక్కువ అని, కాంగ్రెస్‌ పార్టీ రెండు దఫాలుగా అధికారంలోకి రాలేదని ఓ సారి అవకాశం ఇద్దామనే సానుభూతితోనే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటులు అమలు చేస్తామన్న కాంగ్రెస్‌ నేతల హామీలు.. అమలు చేశారా లేదా… అనేది ప్రజలకు తెలుసు అని.. ఇదే లోక్‌ సభ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు హరీష్‌ రావు.

Exit mobile version