Harish Rao: సంగారెడ్డి ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం త్వరలోనే తాను సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ భారీ పాదయాత్ర చేపడతానని మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. జిల్లాలోని ప్రధాన నీటి వనరు అయిన సింగూరు ప్రాజెక్టులో ఉన్న నీళ్లన్నింటినీ ప్రభుత్వం ఖాళీ చేసిందని ఆరోపించారు. రైతులకు క్రాప్ హాలిడే (పంట విరామం) ప్రకటించి కూడా వారికి ఇవ్వాల్సిన కనీస పరిహారాన్ని అందజేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న పంటల బీమా పథకం పూర్తిగా తుస్సు అయిందని ఎద్దేవా చేశారు. గత రెండేళ్లుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులకు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారని, ఇలా పథకాలు అమలు చేయకుండా ఇందిరమ్మ పేరును కాంగ్రెస్ నాయకులే చెడగొడుతున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేశారని హరీష్ రావు దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న స్కాముల ప్రభుత్వం పోయి.. ప్రజలకు మేలు చేసే స్కీముల ప్రభుత్వం తిరిగి రావాలని జనం బలంగా కోరుకుంటున్నారని చెప్పారు. రేపు భూమి బద్దలైనా, రేవంత్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా, ఆఖరికి భూకంపం వచ్చినా సరే.. తెలంగాణలో మళ్లీ వచ్చేది కచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ.. ప్రభుత్వ గురుకుల పాఠశాలల టెండర్లలో ముగ్గురు కాంగ్రెస్ మంత్రులు కలిసి భారీ స్కామ్‌కు పాల్పడ్డారని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అవినీతి విషయంపై నిలదీసేందుకు, అధికారులను కలిసేందుకు తాము వెళ్తుంటే.. రేవంత్ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని తమ్ము దారుణంగా అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై హరీష్ రావు స్పందించారు. “సహజంగా పొట్టిగా ఉన్నోడికి.. పొడుగ్గా ఉన్నోడిని చూస్తే కొంత ఈర్ష్య, అసూయ ఉంటాయి. అందుకే రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా నా ఎత్తు (హైట్) గురించే మాట్లాడుతుంటాడు” అంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అబద్ధాలు చెప్పినా, తెలంగాణలోని ప్రతి గ్రామంలో తాము అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులు స్పష్టంగా కనిపిస్తున్నాయని హరీష్ రావు స్పష్టం చేశారు.

