NTV Telugu Site icon

Gurukul Students Missing : వీడిన ఆరుగురు గురుకుల విద్యార్థుల మిస్సింగ్ మిస్టరీ

Gurukul Students

Gurukul Students

Gurukul Students Missing : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట సమీపంలోని నెమలిపురి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఆరుగురు పదవ తరగతి విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. విద్యా సంవత్సరం ముగింపు సందర్భంగా గురుకులంలో ఉపాధ్యాయులు వీడ్కోలు పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు మద్యం సేవించి పార్టీకి హాజరయ్యారు. వారి ప్రవర్తనతో తోటి విద్యార్థులతో గొడవ జరిగింది. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గమనించి వారిని మందలించారు.

ఉపాధ్యాయుల మందలింపుతో మనస్థాపానికి గురైన ఆరుగురు విద్యార్థులు పాఠశాల నుంచి అదృశ్యమయ్యారు. ఈ ఘటనపై భయాందోళనకు గురైన గురుకుల సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పట్టణంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విద్యార్థులు విజయవాడకు వెళ్లినట్లు గుర్తించారు.

CM Chandrababu: ‘ఆప్’ పాలనపై ఏపీ సీఎం విమర్శలు

విద్యార్థుల ఆచూకీ గుర్తించిన పోలీసులు వెంటనే విజయవాడకు వెళ్లి, అదృశ్యమైన భాను ప్రకాశ్, నాగ వంశీ, వికాస్, జగన్, యువరాజ్, అజయ్‌లను క్షేమంగా పాఠశాలకు తిరిగి తీసుకొచ్చారు. అనంతరం విద్యార్థులకు ప్రత్యేక కౌన్సిలింగ్ అందించి, వారి మానసిక పరిస్థితిని మెరుగుపరిచే చర్యలు చేపట్టారు. విద్యార్థులను తిరిగి ఉపాధ్యాయుల , తల్లిదండ్రుల సంరక్షణలో అప్పగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

విద్యార్థుల రక్షణ కోసం పాఠశాల యాజమాన్యం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థులకు క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే, భవిష్యత్తులో విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని నిర్ణయించారు. ఈ ఘటన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఒక గుణపాఠంగా నిలుస్తుందని, విద్యార్థుల సంక్షేమం కోసం మరింత శ్రద్ధ పెట్టాలని అధికారులు సూచించారు.

Ratha Saptami 2025: అరసవల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు