NTV Telugu Site icon

Gujarat: గుజరాత్‎లో గుట్టలుగా హెరాయిన్.. విలువ వందల కోట్లు

Drugs

Drugs

Gujarat: భారత్‎లో డ్రగ్స్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ధనార్జనే ధ్యేయంగా కోట్లలో వ్యాపారం చేస్తూ అక్రమార్కులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి ఇక్కడ పౌరులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే అధికారులు పటిష్ట నిఘా ఏర్పాటు చేసి.. కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయినా వారి కళ్లు కప్పి డ్రగ్స్, మత్తుపదార్థాల అక్రమ రవాణా జరుగుతూనే ఉంది.

తాజాగా, గుజరాత్‎లో మరోసారి భారీగా డ్రగ్స్ ను అధికారులు పట్టుకున్నారు. పాకిస్తాన్‌ బోటులో అక్రమంగా తరలిస్తుండగా కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ ను నార్కోటిక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారత తీర రక్షక దళం, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌తో కలిసి అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ సమీపంలో ఈ డ్రగ్స్‌ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు సిబ్బందితో కూడిన పాకిస్థాన్ పడవను అక్టోబర్ 8న పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 50 కిలోల హెరాయిన్‌ను కోస్ట్ గార్డు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.350 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read Also: Book Fair in Hyderabad: బాక్స్‌ కొని అందులో ఎన్ని పడితే అన్ని తీసుకెళ్లండి. హైదరాబాద్‌లో బుక్‌ ఫెయిర్‌ రేపటి వరకే
ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏటీఎస్ గుజరాత్‌తో సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలో ఈ ముఠా పట్టుబడింది. వాటితో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్‌లో నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోది. అంతకుముందు, సెప్టెంబర్ 14న, సుమారు రూ. 200 కోట్ల విలువైన 40 కిలోల హెరాయిన్‌ను పాకిస్తానీ బోటు నుంచి పట్టుకున్నట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి భారత్‌లోకి తరలిస్తున్న రూ.1,200 కోట్ల విలువైన 200 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్‌ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ బోటును, ఆరుగురు ఇరాన్‌ పౌరులను అదుపులోకి తీసుకున్నట్లు భారత అధికారులు తెలిపారు.