Guinea-Bissau: ఆఫ్రిక ఖండంలోని మరో దేశంలో తిరుగుబాటు చోటు చేసుకుంది. పశ్చిమ ఆఫ్రికాలోని గినియా-బిస్సావు దేశంలో అకస్మాత్తుగా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. ప్రభుత్వంపై పూర్తి నియంత్రణ తీసుకున్నట్లు సైనిక అధికారులు ప్రకటించారు. సైన్యం తక్షణమే ఎన్నికల ప్రక్రియను నిలిపివేసి, దేశ అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయాలని ఆదేశించింది. సరళంగా చెప్పాలంటే.. మరొక ఆఫ్రికన్ దేశం కూలిపోయింది. గినియా-బిస్సావు దేశం చిన్నదైనప్పటికీ రాజకీయంగా అస్థిరం ఆ దేశాన్ని పట్టి పీడించింది.
READ MORE: Hong Kong: హాంగ్ కాంగ్‌లో ఘోర విషాదం.. 44 మంది సజీవదహనం
అధ్యక్ష పదవి, పార్లమెంటు ఎన్నికలు జరిగిన మూడు రోజులకే ఈ సంఘటన జరిగింది. రాజధాని బిస్సావులోని అధ్యక్ష భవనం సమీపంలో మధ్యాహ్నం భారీ కాల్పులు జరిగాయి. దీంతో సైనిక దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. చాలా మంది పౌరులు భయంతో నగరం నుంచి పారిపోవడం కనిపించింది. కాలినడకన, వాహనాల ద్వారా దేశ విడిచి పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. ప్రధాన రహదారులపై బారికేడ్లు నిర్మించి, రాకపోకలను అడ్డుకున్నారని నివేదికలు వెల్లడించాయి. అధ్యక్ష భవనం, పరిసర ప్రాంతాలలో భద్రతా దళాలను మోహరించారు. ఇంతలో ప్రస్తుత అధ్యక్షుడు ఒమర్ సిసోకో ఎంబాలో ఎక్కడ ఉన్నారో తెలియకపోవడం రాజకీయ అనిశ్చితికి మరింత ఆజ్యం పోసింది.
READ MORE: Haryana: మరో దేశద్రోహి.. పాకిస్థాన్ “ISI”కి రహస్య సమాచారం అందించిన న్యాయవాది!
ఆదివారం జరిగిన ఎన్నికల తర్వాత ప్రముఖ అభ్యర్థులు ఎంబాలావో, ప్రతిపక్ష నాయకుడు ఫెర్నాండో డయాస్ ఇద్దరూ విజయం సాధించామని ఎవరికి వారు ప్రకటించుకున్నారు. గురువారం అధికారిక ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇంతలోనే రాజకీయ అస్థిరత ఏర్పడింది. గినియా-బిస్సావు దేశం ఇప్పటికే సంస్థాగత అపనమ్మకం, అధికార పోరాటాలు, ఎన్నికల ప్రక్రియపై వివాదాలను ఎదుర్కొందని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన PAIGCని సుప్రీంకోర్టు ఎన్నికల్లో పోటీ చేయకుండా తాజా ప్రభుత్వం నిషేధించింది. దీంతో ప్రతిపక్షం ఉద్యమాన్ని ప్రారంభించింది. కాగా.. 1974లో పోర్చుగల్ నుంచి స్వాతంత్ర్యం పొందిన గినియా-బిస్సావు నాలుగు తిరుగుబాట్లను చవిచూసింది. సుమారు రెండు మిలియన్ల జనాభా కలిగిన ఈ దేశం పేదరికం, బలహీనమైన పాలన, అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు ప్రసిద్ధి చెందింది. ఇవే రాజకీయ అస్థిరతకు కారణమయ్యాయి.