TDP vs YSRCP: గుడివాడ రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్.. మున్సిపల్ ఎన్నికల వేళ వైసీపీలో చేరిన టీడీపీ నేత

Tdp Vs Ycp

Tdp Vs Ycp

TDP vs YSRCP: ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక పరిణామాలు కొనసాగుతున్నాయి.. మున్సిపల్ ఎన్నికల వేళ కృష్ణా జిల్లా గుడివాడలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. టీడీపీకి చెందిన నేరుసు చింతయ్య తన అనుచరులు, అభిమానులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని పార్టీ కండువా కప్పి చింతయ్యను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గుడివాడ రాజకీయ పరిణామాలు, కొడాలి నాని నాయకత్వం, వైసీపీ పోరాటాలపై చింతయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మండుటెండలో గుడివాడ ప్రజల దాహార్తిని తీర్చిన వ్యక్తి కొడాలి నాని అని కొనియాడారు. సొంత డబ్బును పేదల కోసం ఖర్చు చేసిన గొప్ప నాయకుడని, గుడివాడలో చిన్న వ్యాపారస్తులకు సైతం ఎలాంటి హాని చేయని వ్యక్తి అని ప్రశంసించారు. కొడాలి నాని నాయకత్వంలోనే గుడివాడ అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని పేర్కొన్నారు.

అదే సమయంలో తెలుగుదేశం పార్టీపై చింతయ్య విమర్శలు గుప్పించారు. టీడీపీలో జెండాలు మోసిన కార్యకర్తలను పక్కనపెట్టి, ఇప్పుడు పదవుల కోసం బేరసారాలు చేస్తున్నారని ఆరోపించారు. రూ.25 లక్షలు ఉంటే వ్యాపారస్తులైనా, విదేశీయులైనా అర్హులుగా పరిగణిస్తున్నారంటూ విమర్శించారు. ప్రస్తుతం వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో అధికార పార్టీ నేతలు సైతం వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని చింతయ్య అన్నారు. ప్రజా సమస్యలపై వైసీపీ చేస్తున్న పోరాటానికి అండగా నిలవాలనే ఉద్దేశంతోనే కొడాలి నాని నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఇక, గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని నాయకత్వంలో మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని, వైసీపీ బలోపేతానికి తన వంతు సహకారం అందిస్తానని ప్రకటించారు నేరుసు చింతయ్య..