NTV Telugu Site icon

Gudivada Amarnath: రాజధానిపై అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Gudivada

Gudivada

Gudivada Amarnath: విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ పై ప్రజా తీర్పు కచ్చితంగా రిఫరెండమే అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై స్పందించారు.. అయితే, మూడు రాజధానులు అని ప్రకటించినా.. అమరావతికి మేం ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చిన ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అమరావతితో పాటు వైజాగ్ నగరం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు అమర్నాథ్‌.

Read Also: Kanchana 4: ‘కాంచ‌న 4’ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది.. సమ్మర్ టార్గెట్!

పేర్లు మార్పు ప్రారంభించిన కొత్త ప్రభుత్వం.. ఎన్టీఆర్‌ జిల్లాకు పెట్టిన పేరు కూడా మారుస్తారా..? అని ప్రశ్నించారు అమర్నాథ్.. ఇక, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తన అభిప్రాయం మీడియా ముందు చెప్పారు.. ఇది రాజా ఒక్కడి అభిప్రాయమా? లేక అందరికీ ఇబ్బందులు వున్నాయా? అనేది సమీక్షించుకుంటాం అన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ అనే ప్రచారం నమ్మితే తప్పు అవుతుంది.. జనం అభిప్రాయంగా స్వీకరిస్తేనే సమీక్షకు అవకాశం లభిస్తుందన్నారు. ప్రజలను సంతృప్తి పరచడం ఎంత గొప్ప నాయకుడు వల్ల కాదనేది ఫలితాలను బట్టి అర్థం అవుతుందన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గాలు భీమిలి, గాజువాక సహా అన్ని చోట్ల కూటమి మెజారిటీలు నమోదు అవ్వడానికి 100 శాతం ఓటు ట్రాన్స్ ఫర్ అవ్వడమే కారణంగా చెప్పుకొచ్చారు. కేంద్రంలో భాగస్వామి అయ్యే అవకాశం టీడీపీకి వచ్చినందున విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను అడ్డుకోవడానికి చొరవ తీసుకోవాలని సూచించారు. మా ఓట్ షేర్ బలంగా వుంది… మేం ఎవరికి మద్దతు ప్రకటించాల్సిన అసరం ఉండదన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కాగా, 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన గుడివాడ అమర్నాథ్.. వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లో చివరి రెండేళ్లలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజా ఎన్నికల్లో ఆయన్ను గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది వైసీపీ.. అయితే, టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు చేతిలో గుడివాడ అమర్నాథ్ ఓటమిపాలైన విషయం తెలిసిందే.