NTV Telugu Site icon

Hyderabad: గోదావరి రెండో దశ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Drinking Water

Drinking Water

Hyderabad: రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నగర ప్రజలకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్ మహా నగర తాగునీటి అవసరాలు మరింత మెరుగు పర్చేందుకు గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్.. జీవో Rt.No.345 జారీ చేశారు. గోదావరి రెండో దశ పనులకు రూ.5560 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా నగరానికి అదనపు జలాలను తరలించడంతో పాటు.. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర జలాశయాల్ని పునరుజ్జీవం చేయనుంది. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ విధానంలో పనులు పూర్తి చేయనుంది.

Read Also: Telangana: అమెరికాలో రేవంత్‌ పర్యటన.. హైదరాబాద్‌లో మరిన్ని ఉద్యోగాలు

ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలకు అన్ని సోర్సుల నుంచి 580 ఎంజీడీల నుంచి 600 ఎంజీడీల నీరు సరఫరా చేస్తున్నారు. 2030వ సంవత్సరం వరకు నీటి అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని 170 ఎంజీడీల అదనపు జలాల్ని సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి నది నుంచి మొత్తం 30 టీఎంసీల నీరు వాడుకునే వెసులుబాటు ఉండటంతో.. అదనపు జలాల కోసం గోదావరి ప్రాజెక్టు ఫేజ్-2ను చేపట్టాలని నిర్ణయించింది. 2030వ సంవత్సరం వరకు.. హైదరాబాద్ నగర తాగునీటి డిమాండ్ 750 ఎంజీడీలకు పెరుగుతుంది. 2050 నాటికి ఈ సంఖ్య 1014 ఎంజీడీలుగా ఉండనుంది. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించింది.

గోదావరి డ్రికింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్-1 కింద.. నగర ప్రజల నీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే 10 టీఎంసీల నీరు తరలిస్తోంది. తాజాగా పథకం రెండో దశ ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరో 15 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉంది. ఈ 15 టీఎంసీల్లో.. 10 టీఎంసీలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు పోగా.. మూసీ ప్రక్షాళనలో భాగంగా.. జంట జలాశయాలను పునరుజ్జీవనం చేసేందుకు మిగిలిన 5 టీఎంసీలను ఉపయోగించనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రెండు లాభాలున్నాయి. ఒకటి హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చడం. రెండోది.. మూసీ ప్రక్షాళన, జంట జలాశయాల పునరుజ్జీవం చెయ్యడం.

Read Also: Bhatti Vikramarka: షాద్ నగర్ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది..

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన DPRను.. WAPCOS అనే కంపెనీ సిద్ధం చేసింది. ఇందులో పంప్ హౌజ్ లు, సబ్ స్టేషన్లు, మల్లన్న సాగర్ నుంచి ఘన్ పూర్ వరకు 3600 ఎంఎం డయా భారీ పైపు లైన్ నిర్మించనున్నారు. అంతే కాకుండా ఘన్ పూర్, శామీర్ పేట్ వద్ద 780 ఎంఎల్డీల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాన్ని(WTP)ని నిర్మించనున్నారు. ఘన్ పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణంతో పాటు.. ఇతర పనులు చేపట్టనున్నారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ -1 ద్వారా 163 ఎంజీడీల నీరు సరఫరా చేస్తున్నారు.

ప్రభుత్వం 6 నెలల లోపే నగర అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ.. తాగునీటి సరఫరా, మురుగు నీటి శుద్ధికి భారీగా నిధులు కేటాయించింది. మొన్న ఎస్టీపీల ప్రాజెక్టు కోసం రూ. 3849.10 కోట్లు కేటాయిస్తే.. తాజాగా తాగునీటి సరఫరా, మూసీ ప్రక్షాళన, జంట జలాశయాల పునరుజ్జీవం కోసం రూ.5560 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇప్పటిదాకా దాదాపు రూ.9410 కోట్లు కేటాయించింది. గత పదేళ్లలో జలమండలికి ఈ స్థాయిలో నిధులు కేటాయించడం ఇదే తొలిసారి.