CM Revanth Reddy : సైబర్ నగరంగా పేరొందిన హైదరాబాద్‌లో ఇప్పుడు గూగుల్ నుంచి మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మొదలవుతోంది. ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్ ఏర్పాటు చేస్తున్న గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC) ఇవాళ ఉదయం 11 గంటలకు హైటెక్‌సిటీ దివ్యశ్రీ భవన్‌లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇది భారత్‌లో గూగుల్ ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ కావడం విశేషం. ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో టోక్యో తర్వాత గూగుల్ మొదలుపెట్టిన రెండో సెంటర్ ఇది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది ఐదవది కావడం గమనార్హం.
గతేడాది ఆగస్టులో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, హైదరాబాద్‌లో ఈ సెంటర్ ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆ విజన్ ఫలితంగా ఈ రోజు GSEC హైదరాబాద్‌లో ప్రత్యక్షమవుతోంది. ఇండియాలోని అనేక రాష్ట్రాలు ఈ సెంటర్‌ను తమ వద్ద ఏర్పాటు చేయాలంటూ పోటీ పడ్డా, సీఎం రేవంత్ ముందస్తు ప్లానింగ్‌తో గూగుల్‌ను తెలంగాణ వైపుకు తిప్పగలిగారు. 2023 అక్టోబర్‌లో “గూగుల్ ఫర్ ఇండియా 2024” కాన్‌క్లేవ్‌లో గూగుల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
తర్వాత 2024 డిసెంబర్ 4న గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సన్ నేతృత్వంలోని బృందం రాష్ట్ర ప్రభుత్వంతో అధికారిక ఒప్పందం చేసుకుంది.
GSEC అంటే ఏమిటి?
ఇది సైబర్ సెక్యూరిటీ రంగానికి సంబంధించిన ఇంటర్నేషనల్ హబ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భద్రతా వ్యవస్థలు, ఆన్‌లైన్ సేఫ్టీ టూల్స్‌ను అభివృద్ధి చేయడంలో ఇది కీలకంగా పనిచేయనుంది. ప్రపంచ నిపుణులు, పరిశోధకులు ఇందులో భాగమవుతారు. ఈ కేంద్రం ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్ర యువతకు లభించే అవకాశముంది. ఐటీ రంగంలో తెలంగాణ మరింత ముందుకు దూసుకుపోతుందన్నది ఈ అభివృద్ధి సంకేతం.