వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల.. అదే విధంగా ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 42 అడుగులకు చేరుకున్నప్పటికీ.. మరి కాసేపట్లో 43 అడుగులకు చేరనుంది. 43 అడుగులకి గోదావరి నీటిమట్టం చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. అయితే ఈ అర్థ రాత్రి కానీ మొదటి ప్రమాదం హెచ్చరిక వస్తుందని ముందుగా అధికారులు భావించినప్పటికీ.. అంతకంటే ముందే మొదటి ప్రమాద హెచ్చరిక రానున్నది. ప్రధానంగా దిగువన శబరికి భారీ వరద వచ్చింది. ఛత్తీస్గడ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున వర్షాలు పడుతుండటంతో గోదావరికి వరద పోటు మొదలైంది.
Read Also: Internet Shutdown: 24 గంటల పాటు ఇంటర్నెట్ బంద్..సోషల్ మీడియా యూజర్లకు హెచ్చరిక..
వరద నీరు పెరగడంతో భద్రాచలం స్నాన ఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు నీటిలో మునిగిపోయాయి. చర్ల మండలం వద్ద ఈత వాగుపై నుంచి వరద నీరు పారడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం వద్ద సీతవాగు, గుబ్బల మంగి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పర్ణశాల వద్ద నార చీరల ప్రాంతం వరద నీటిలో మునిగింది. తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రస్తుతం వరద పోటెత్తుతోంది. కాళేశ్వరం, తుపాకుల గూడెం నుంచి భారీ వరద వస్తుంది. మరోవైపు.. ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వర్షాలతో కూడా భారీ వరద వచ్చి గోదావరిలో చేరుతోంది. ఇప్పటివరకు పోలవరం, ధవలేశ్వరం వద్ద వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకి వదులుతున్నారు. దీంతో గోదావరి నుంచి సముద్రం వైపుకి భారీగా వరద తరలివెళ్తుంది.
Read Also: Heavy Floods: ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి.. గోదావరిలో పెరుగుతున్న ప్రవాహం