GHMC Ward Delimitation: GHMC వార్డుల పునర్విభజన పై భారీగా అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పటి వరకు 5,905 అభ్యంతరాలు రావడం గమనార్హం. నిన్న ఒక్కరోజే 1,283 అభ్యంతరాలు అధికారులు స్వీకరించారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. అభ్యంతరాల స్వీకరణ మరో రెండు పొడిగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కు హైకోర్టు ఆదేశించింది. దీంతో ఎల్లుండి వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. వార్డుల విభజన శాస్త్రీయంగా జరగలేదని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.ఒక్కో వార్డులో తక్కువ జనాభా మరో వార్డులో ఎక్కువ జనాభా ఉందని ఫిర్యాదులు వచ్చాయి. ఒక్కో వార్డు రెండు మూడు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఉన్నాయని అభ్యంతరాలు వచ్చాయి.
READ MORE: Neelakanta Teaser: ‘నీలకంఠ’ టీజర్ రిలీజ్.. టాలీవుడ్‌పై కన్నేసిన మాస్టర్ మహేంద్రన్!
కాగా.. ఈ నెల 16న GHMC ప్రత్యేక కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. ఈ సమావేశంలో ప్రధానంగా వార్డుల పునర్విభజన అంశంపై చర్చ కొనసాగింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల విలీనం చేసిన 27 మునిసిపాలిటీలతో పాటు, ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300 వరకు పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కార్పోరేటర్లు మరియు నగరవాసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చర్చల సమయంలో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. దారుస్సలంలో వార్డుల విభజన జరిగిందంటూ బీజేపీ కార్పోరేటర్లు చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం కార్పోరేటర్లు అభ్యంతరం తెలిపారు. దీంతో ఎంఐఎం, బీజేపీ కార్పోరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీజేపీ కార్పోరేటర్లు గెజిటెడ్ పత్రాలను చింపి సభలో విసిరివేసి, మేయర్ పోడియం వైపు దూసుకెళ్లారు. దీనిపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గందరగోళం మధ్య పునర్విభజనపై కార్పోరేటర్ల నుంచి వచ్చిన అభిప్రాయాలు, అభ్యంతరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని మేయర్ ప్రకటించారు.