రోడ్డు ప్రమాదాలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. దైవదర్శనానికి సంతోషంగా వెళుతున్న కుటుంబంపై విధి కాటేసింది. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం గ్రామ సమీపంలో జాతీయ రహదారి 44 పై జరిగిన కారు ప్రమాదం హృదయ విదారకంగా మారింది. ప్రమాదం జరిగిన చోట రహదారిపై చెల్లా చెదురుగా పడిపోయాయి మృతదేహాలు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ కు చెందిన ప్రకాశం, లక్ష్మి దంపతులు తమ కూతురి పుట్టినరోజు సందర్భంగా ఇంకో కూతురితో కలిసి నలుగురు తిరుపతికి దైవ దర్శనానికి బయలుదేరారు.
జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దులకు రాగానే ఇటిక్యాల మండలం ధర్మారం గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని వెనక నుండి వేగంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న తల్లి లక్ష్మి (50) కూతురు శ్రీలత (18) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ప్రకాశం (55) మరో కూతురు మానస (17) తీవ్రంగా గాయపడడంతో హుటాహుటిన కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పాలకొల్లులో తృటిలో తప్పిన ప్రమాదం
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. స్థానిక సొంత మార్కెట్ వద్ద నుండి ప్రధాన రహదారి వైపునకు వెళుతున్న కొబ్బరి డొక్క లోడు డాక్టర్ ట్రక్కు స్థానిక ఆంజనేయస్వామి గుడి వద్ద ఉన్న కాలువ ఎత్తు ర్యాంపు ఎక్కుతున్న సమయంలో ట్రాక్టర్ వెనక్కి జారి అదుపుతప్పి బోల్తా కొట్టింది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఆకస్మికంగా జరిగిన ఘటనలో అటుగా వెళుతున్న రెండు బైకులు ఈ ప్రమాదానికి గురయ్యాయి. అయితే అదృష్టవశాత్తు బైక్ పై వెళ్తున్నవారు బైక్ నుండి దూకి ప్రమాదం నుండి తప్పించుకున్నారు. వీరిలో ఇద్దరు సచివాలయం సిబ్బంది ఉన్నారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహకారంతో ట్రాక్టర్ ను అక్కడినుంచి తరలించారు. ఆరహదారిలో ట్రాఫిక్ క్లియర్ చేశారు. దీంతో దాదాపు మూడు గంటల సేపు బస్టాండ్ కి రావలసిన ఆర్టీసీ బస్సులను ప్రధాన రహదారి గుండా బస్టాండ్ కు మళ్ళించారు.
Read Also: AUS Vs ENG: వరుణుడి ఖాతాలో నాలుగో మ్యాచ్.. మెగా టోర్నీలో మరో కీలక మ్యాచ్ రద్దు