Tragedy : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పదవ తరగతి పరీక్ష రాసి ఇంటికి తిరుగు ప్రయాణమవుతున్న ఓ విద్యార్థిని, ఆర్టీసీ డబల్ డెక్కర్ బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో ఆమె అన్నకు గాయాలయ్యాయి. సుమన్ ఛత్రియ అనే యువకుడు తన చెల్లి ప్రభాతి ఛత్రియ (16)ను స్కూటీపై తీసుకుని లింగంపల్లి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌పై ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఆర్టీసీ డబల్ డెక్కర్ బస్సు కింద పడింది. ఈ ఘటనలో ప్రభాతి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. సుమన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటన చూసిన ప్రత్యక్ష సాక్షులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. పరీక్ష రాసి ఇంటికి తిరుగు ప్రయాణమైన ఓ విద్యార్థిని అకాల మరణం చెందడంతో అక్కడే ఉన్న ప్రజలు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. గచ్చిబౌలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదం మరోసారి ద్విచక్ర వాహనదారుల భద్రతపై ప్రశ్నలు లేపుతోంది. బస్సులు, పెద్ద వాహనాల మధ్య స్కూటీలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. రోడ్లపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేకంగా యువత శ్రద్ధ వహించాలని సూచించారు.
మృతురాలు ప్రభాతి ఛత్రియ గచ్చిబౌలి సమీపంలోని TNGO కాలనీలో నివసిస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. “పరీక్ష రాయించేందుకు తీసుకెళ్లిన చెల్లిని ఇలా కోల్పోతానని ఊహించలేదు” అంటూ అన్న సుమన్ కన్నీరు మున్నీరయ్యాడు. ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల అసలు కారణాన్ని తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటించాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి నొక్కి చెబుతోంది.
Elon Musk : దటీజ్ మస్క్..! ఫ్యూచర్ ప్లాన్స్ తెలిస్తే షాక్..!!