NTV Telugu Site icon

YSRCP Rebel MLAs Letter: నోటీసులపై స్పందించిన వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు.. స్పీకర్‌కు లేఖలు

Letter

Letter

YSRCP Rebel MLAs Letter: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.. మూడేళ్ల క్రితం రాజీనామా చేసిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్‌ ఆమోదించగా.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి అనుకూలంగా ఓటు వేయటంతో టీడీపీ అభ్యర్ది విజయం సాధించారు. దీంతో, ఈ సారి అలాంటి అవకాశం ఇవ్వకూడదని వైసీపీ పావులు కదుపుతోంది.. వారి పైన అనర్హత వేటు దిశగా చర్యలు మొదలు పెట్టింది.. వైసీపీ ఫిర్యాదు ఆధారంగా ఆ నలుగురికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు.. అయితే, తమకిచ్చిన నోటీసులపై స్పీకర్‌కు లేఖలు పంపించారు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు..

Read Also: Thammineni Seetharam: బాబు, పవన్‌, బీజేపీ, షర్మిల కలిసి వచ్చినా మళ్లీ జగనే సీఎం..

స్పీకర్ కార్యాలయానికి లేఖలు పంపించారు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి.. స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులకు రిప్లై ఇచ్చేందుకు నాలుగు వారాల గడువు కోరుతూ ఆ లేఖల్లో పేర్కొన్నారు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు.. ఇక, తాను అనారోగ్యంతో ఉన్నందున రిప్లై ఇచ్చేందుకు నాలుగు వారాల గడువు కోరారు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. తనను విశ్రాంతి అవసరమని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్‌ను స్పీకర్‌కు రాసిన లేఖకు జత చేశారు మేకపాటి. అయితే, లేఖల్లో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు రాసిన లేఖలో ప్రధానంగా.. సహజ న్యాయ సూత్రాల ప్రకారం రిప్లై ఇవ్వడానికి 30 నుంచి 60 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుంది.. నోటీసుతో పాటు పంపిన పేపర్, వీడియో క్లిప్పింగ్‌లు అసలైనవో.. మార్ఫ్ చేసినవో నిర్ధారించుకోవాలి.. మాపై ఫిర్యాదు చేసిన వాళ్లు ఇచ్చిన ఆధారాల ఒరిజినల్స్ ఇవ్వాలి. సోషల్ మీడియా పోస్టింగులకు సంబంధించిన ఐపీ అడ్రస్సులు ఇవ్వాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం దృష్టికి తీసుకెళ్లారు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి. దీంతో.. రెబల్స్‌ ఎమ్మెల్యేల వ్యవహారం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.