Kite String Slits Throat: గాలి పటాలు ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా మరో పిల్లాడు గాలిపటానికి బలైపోయాడు. గుజరాత్ రాష్ట్రంలోని మహిసాగర్ జిల్లాలో గాలిపటం దారం గొంతును కోయడంతో తీవ్ర రక్తస్రావంతో 4 ఏళ్ల పిల్లాడు మరణించాడు. ఉత్తరాయణ పండుగ(మకర సంక్రాంతి) గాలిపటాలను ఎగరేస్తుంటారు. అయితే ఈ సరదా పలువురి పాలిట శాపంగా మారుతోంది.
తరుణ్ మచ్చి అనే చిన్నారి తన తండ్రితో బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ఆదివారం మధ్యాహ్నం బోరాడి గ్రామ సమీపంలో గాలిపటం దారం పిల్లాడి గొంతును కోసినట్లు కొతంబా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. బైకుపై పిల్లాడు ముందు కూర్చుండటంతో ఈ ఘోరం జరిగింది. అతని మెడకు బలమైన గాయం కావడంతో, చికిత్స అందించడాని ముందే మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: Tamil Nadu: త్యాగమూర్తివమ్మ..కోట్ల విలువైన భూమి పాఠశాలకు విరాళం..
పండగ సందర్భంగా గాలిపటాల కారణంగా గుజరాత్ వ్యాప్తంగా 66 మంది వ్యక్తులు గాయపడ్డారు. వీటిలో 27 కేసులు అహ్మదాబాద్‌లోనే నమోదయ్యాయి. వడోదరలో ఏడు, సూరత్ (6), రాజ్‌కోట్ (4), భావ్‌నగర్ (4) కేసులు నమోదయ్యాయి. ఒక్క గుజరాత్ లోనే కాదు దేశవ్యాప్తంగా పలు మరణాలు సంభవించాయి. హైదరాబాద్ లంగర్ హౌజులో చైనా మాంజా దారం గొంతకు కోసుకుని కోటేశ్వర్ రెడ్డి అనే ఆర్మీ జవాన్ మరణించారు. అల్వాల్‌లో ఆకాష్ అనే యువకుడు గాలిపటం ఎగరేసే క్రమంలో బిల్డింగ్‌పై నుంచి పడిపోయి మరణించాడు.