Dog Attack: హైదరాబాద్ అంబర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాధకర ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటున్న పిల్లాడిపై వీధికుక్కలు దాడిచేసి చంపేశాయి. సెలవు రోజు కావడంతో తండ్రితో కలిసివెళ్లిన బాలుడికి అదే రోజు చివరి రోజయ్యింది. తండ్రి పనిలో నిమగ్నమవ్వడంతో తన అక్కదగ్గరికి వెళ్దామనుకున్న చిన్నారిని కుక్కలు చీల్చిచెండాడాయి. అప్పటి వరకు ఉత్సాహంగా ఆడుకున్న చిన్నారి క్షణాల వ్యవధిలోనే కనుమూయడాన్ని ఆ తండ్రి జీర్ణించుకోలేకున్నాడు. పూర్తి వివరాలు.. నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్ నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. అంబర్‌పేట ఛే నంబరు చౌరస్తాలో ఉన్న ఓ కారు సర్వీస్ సెంటర్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. భార్య జనప్రియ, ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్‌లతో కలిసి బాగ్‌అంబర్‌పేట ఎరుకుల బస్తీలో నివాసం ఉంటున్నారు.
Read Also: Fire Accident: కెమికల్ డ్రమ్ములు తీసుకెళ్తున్న డీసీఎంలో మంటలు
ఆదివారం హాలిడే కావడంతో గంగాధర్ పిల్లలిద్దర్నీ తాను పని చేస్తున్న సర్వీస్ సెంటర్‌కు తీసుకువచ్చాడు. కుమార్తెను పార్కింగ్ ప్రదేశం వద్ద ఉన్న క్యాబిన్‌లో ఉంచి, కుమారుడిని సర్వీస్ సెంటర్ లోపలికి తీసుకెళ్లాడు. కుమారుడు అక్కడే ఆడుకుంటూ ఉండటంతో మరో వాచ్‌మన్‌తో కలిసి పని మీద బయటకు వచ్చాడు. కాసేపు అక్కడే ఆడుకున్న ప్రదీప్, తర్వాత అక్క కోసం క్యాబిన్ వైపు నడుచుకుంటూ వస్తుండగా వీధి కుక్కలు వెంటపడ్డాయి. భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు అటు ఇటూ పరుగులు తీసినా అవి వదల్లేదు. ఒకదాని తర్వాత ఒకటిగా బాలుడిపై దాడిచేశాయి. రెండు కుక్కలు చెరోవైపు లాగడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తమ్ముడి ఆర్తనాదాలు విని తండ్రికి సమాచారమిచ్చింది. గంగాధర్ వాటిని వెళ్లగొట్టడంతో బాలుడిని వదిలేశాయి. తీవ్ర గాయాలపాలైన కుమారుడిని తండ్రి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.