NTV Telugu Site icon

Penamaluru Politics: టీడీపీలోకి ఎమ్మెల్యే పార్థసారథి.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బోడే వర్గం!

Penamaluru

Penamaluru

Penamaluru Politics: పెనమలూరు టీడీపీలోకి ఎమ్మెల్యే పార్థసారథి రాక రచ్చ రేపుతోంది. ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరిక ఖాయం కావటంతో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వర్గం ఆందోళనకు గురవుతోంది. సీటుకు ఎసరుపెట్టేలా తాజా రాజకీయ పరిణామాలు జరుగుతుండడంతో టికెట్ రాదేమోననే ఆందోళనలో బోడే ప్రసాద్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొలుసు పార్థసారధి రాకను బోడే ప్రసాద్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథికి వైసీపీ నుంచి అవకాశం దక్కలేదు. ఈ క్రమంలో టీడీపీలో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన టీడీపీ నుంచి పెనమలూరు టికెట్‌ను ఆశిస్తున్నారు.

Read Also: Cervical Cancer Vaccination: 9-14 ఏళ్ల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సినేషన్.. ప్రారంభించనున్న కేంద్రం..

పార్ధసారథి పెనమలూరు టీడీపీ అభ్యర్థిగా వస్తే ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోమని బోడే ప్రసాద్‌ కేడర్ స్పష్టం చేసింది. పార్టీలో జరుగుతున్న పరిణీమాలపై అసంతృప్తితో బోడే ప్రసాద్ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో బోడే ప్రసాద్‌ను బుజ్జగించే పనిలో టీడీపీ పడింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను బోడే ప్రసాద్‌ ఇంటికి టీడీపీ అధిష్ఠానం పంపించింది. బోడే ప్రసాద్‌ను కలిసి పార్టీ అన్యాయం చేయదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పినట్లు తెలిసింది.

పెనమలూరులో బోడే ప్రసాద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సీటు మనదేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా ఏ నిర్ణయం జరగలేదని.. ఎవరూ ఆగ్రహ ఆవేశాలకు గురికావద్దన్నారు. చంద్రబాబు తీసుకునే నిర్ణయం ఎంటో తెలియకుండా మాట్లాడటం సరికాదన్నారు. పార్టీ లైన్ దాటి మాట్లాడటం సరికాదన్నారు. గెలుపు మనదేనని.. పుకార్లు నమ్మవద్దని పార్టీ కేడర్‌కు బోడే ప్రసాద్ సూచించారు. మీ అందరి సహకారంతో తగ్గేదే లేదన్నారు.