ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడం పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. కోకాపేటలోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. “డీజీపీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. రాజకీయ ప్రేరేపిత కేసుల్లో తొందరపాటు పనిచేయదు. బెయిలబుల్ సెక్షన్స్ లో అర్ధరాత్రి అరెస్టులు చేయడం దారుణం. ఇలాంటి కేసుల్లో నాయకులు చెబితే వినడం కాదు, చట్టాలకు లోబడి పని చేయాలి. బెయిలబుల్ కేసులు అని తెలిసి రాత్రంతా ఇబ్బంది పెట్టారు. బెయిలబుల్ సెక్షన్లకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. కానీ కావాలని పండుగ పూట డెకాయిట్ నో, టెర్రరిస్ట్ నో అరెస్ట్ చేసినట్టు పెద్ద సంఖ్యలో పోలీసులు వెళ్లి అరెస్టు చేయడం దుర్మార్గం. పొలిటికల్ మోటివ్ కేసుల్లో ఎలా వ్యవహరించాలో అనేదానిపై పోలీసులకు డైరెక్షన్ ఇవ్వాలని డీజీపీని కోరుతున్నా.
ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ పండుగ అని కూడా చూడకుండా అరెస్టులు చేయడం మానుకోవాలని సూచిస్తున్నా. కౌశిక్ రెడ్డి మీద 28 కేసులు ఉన్నాయి. అరెస్టు చేయాలని అంటున్నారు. ఎవరు పెట్టారు కేసులు. రేవంత్ రెడ్డి రాకముందు కౌశిక్ రెడ్డి మీద ఒక్క కేసు కూడా లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కౌశిక్ రెడ్డి పై అక్రమ కేసులు బనాయించింది మీరు కాదా. 28 కేసులు మీరు పెట్టినవే కదా.” అని ప్రశ్నించారు.
ప్రశ్నించడంలో తప్పేముంది?
కలెక్టర్ ఆహ్వానం మేరకు కౌశిక్ రెడ్డి మీటింగ్‌కు వెళ్లారని.. పిలవని పేరంటానికి ఆయన వెళ్లలేదని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. “మీటింగ్లో సభ్యుడిగా నువ్వే పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని ప్రశ్నించాడు. ఇందులో తప్పేముంది. ఒక కౌశిక్ రెడ్డి కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. పార్టీ మారిన పదిమంది శాసనసభ్యులను ప్రతి ఒక్కరూ అడుగుతూనే ఉంటారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచి, బీఆర్‌ఎస్ పార్టీ బట్టలిప్పుతా అని సంజయ్ అంటే ఎలా ఊరుకుంటారు? నువ్వే పార్టీ తరుఫున మాట్లాడుతున్నామని అడిగారు. ఇలా ప్రశ్నించడంలో కౌశిక్ రెడ్డి తప్పేం లేదు. దీనికి మూడు కేసులు పెడతారా? ఒక సంఘటన మీద ముగ్గురు వేర్వేరు ఫిర్యాదులు తీసుకుని కేసులు పెడతారా. మీ కక్ష సాధింపు చర్యలకు ఇది నిదర్శనం కాదా? ఒకే కేసులో మూడు ఎఫ్‌ఐఆర్‌లు పెట్టి, రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెట్టడం కక్ష సాధింపే కదా? రేవంత్ రెడ్డి ప్రోత్బలంతో రాజకీయ కుట్రలో భాగంగా పెట్టిన కేసులు ఇవి. ఒక్కరోజైనా కౌశిక్ రెడ్డిని జైల్లో పెట్టాలని పగా, ప్రతికారంతో, కుట్రతో చేసిన అరెస్టే తప్ప మరొకటి కాదు. న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. కౌశిక్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం చాలా సంతోషం. ఇటువంటి చర్యలు ఇప్పటికైనా మానుకోవాలని డిజిపి గారిని అప్పీల్ చేస్తున్నాను.” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదో రాజకీయ కక్ష సాధింపు చర్య?
పండుగ పూట పోలీసులను కూడా ఇబ్బందులు పెట్టడం, టెన్షన్ పెట్టడం సరికాదని హరీశ్ రావు అన్నారు. “మీ కింది స్థాయి పోలీసులను, అధికారులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యమంత్రి చెప్పాడని ఈ రకంగా అక్రమ అరెస్టులు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. సంజయ్ గారు కౌశిక్ రెడ్డి ని కూడా నెట్టారు ఆయనపై ఎందుకు కేసు నమోదు చేయలేదు. కౌశిక్ రెడ్డి మీదనే ఎందుకు కేసు నమోదు చేశారు. మీ పక్షపాత వైఖరి స్పష్టంగా కనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి ఏడాది పాలన పగా, ప్రతీకారంతోనే కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి, పోలీసులు చేయాల్సిన పని రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటం. పోలీసులు తన పని తాను చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీనిస్తున్నాయి. 23% క్రైమ్ రేట్ పెరిగింది. ఎన్‌సీఆర్‌బీ (NCRB) రిపోర్టు ప్రకారం హైదరాబాద్ ఎల్లో జోన్ లో ఉంది. ఇదే పద్ధతి కొనసాగితే హైదరాబాద్ రెడ్ జోన్లకు వెళ్లే ప్రమాదముంది. పెట్టుబడులు రాకుండా పోయే ప్రమాదం ఉంది. హోం మంత్రిగా కూడా ముఖ్యమంత్రి గారే ఉండి తన బాధ్యతలు నిర్వర్తించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా కక్షపూరిత రాజకీయాలు మానుకొని పరిపాలన మీ దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డికి, వారి ప్రభుత్వానికి హితవు పలుకుతున్నాం. మంత్రులు, మీడియా ముందు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తానని బహిరంగంగా సంజయ్ ప్రకటించారు. స్పీకర్ గారు సంజయ్ గారి మీద చర్యలు తీసుకోవాలి. తక్షణమే సంజయ్ ని అనర్హుడిగా ప్రకటించే బాధ్యత స్పీకర్ గారి మీద ఉంది.” అని ఆయన తెలిపారు.
వారిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలి..
చోర్ ఉల్టా కొత్వాల్ కే డాంటి అన్నట్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలంటున్నారని.. చర్యలు తీసుకోవాల్సింది పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల పైన అని మాజీ మంత్రి స్పష్టం చేశారు. “కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా పార్టీ మారిండు, పార్టీలోకి తీసుకోవద్దని చెబుతున్నాడు కదా. ఇంతకంటే స్పీకర్ గారికి ఆధారాలు ఏం కావాలి. స్పీకర్ తక్షణమే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఫిరాయింపుల విషయంలో బీఆర్‌ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టులో అనర్హత పిటిషన్ పెండింగ్లో ఉండడం ఆలస్యం అవుతుంది కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్లాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. త్వరలోనే సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వస్తాయి. న్యాయం నిలబడుతుంది. అనర్హత వేటు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పడుతుంది. నిజాయతీ ఉంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచి సంజయ్ మాట్లాడాలి.” అని హరీశ్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.