తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా..? అని దుయ్యబట్టారు. మీరు ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల సాక్షిగా మీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైందని హరీష్ రావు ఆరోపించారు. ఊరూరా తిరగబడుతున్న జనం, ఎక్కడిక్కడ నిలదీస్తున్న ప్రజానీకాన్ని చూస్తే మీ ఏడాది పాలన పెద్ద ఫెయిల్యూర్ అని అర్థమవుతున్నదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల్లో, మంత్రులందరూ పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉంటే ప్రజలను ఎవరు పట్టించుకోవాలని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో పోలీసు పహారా నడుమ గ్రామ సభలు నిర్వహించాల్సిన దుస్థితి రావడం దారుణమని హరీష్ రావు అన్నారు.
APPSC Group-1 Mains: గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష తేదీలు వచ్చేశాయ్
పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ఒకవైపు గ్రామ సభలు నిర్వహిస్తుంటే.. మరోవైపు కార్యకర్తలకే పథకాలు ఇస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు చెప్పడం సిగ్గుచేటని హరీష్ రావు దుయ్యబట్టారు. అలాంటపుడు గ్రామ సభలు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నట్లేనా.. అర్హులైన వారికి పథకాలు ఎగ్గొడుతున్నట్లేనా..? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు హామీలిస్తం, అధికారంలోకి వచ్చాక ఎగ్గొడుతం అన్నట్లుగా వ్యవహరిస్తే, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు.. అర్హులైన అందరికి ఇస్తామని చెప్పి ఇప్పుడు భారీ కోతలు విధిస్తే ప్రజలు తిరగబడకుండా ఏం చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ నాయకుల పాపం, అధికారులకు శాపంగా మారింది. సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొందని అన్నారు. మీరు నిర్వహిస్తున్న గ్రామ సభలు దగా.. ఆరు గ్యారెంటీలు అమలు దగా.. రుణమాఫీ చేయడం దగా.. పంట బోనస్ ఇవ్వడం దగా.. రైతు భరోసా అమలు దగా.. రేషన్ కార్డుల జారీ దగా.. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక దగా అని హరీష్ రావు మండిపడ్డారు.
Cricket Betting: సంచలనంగా మారిన క్రికెట్ బెట్టింగ్ కేసు.. రూ.176 కోట్లు..!
ఏడాది కాలంలో మీరు చేసిన దగాను ప్రజలు అర్థం చేసుకున్నారు.. మీరు చేసిన మోసాన్ని, నయవంచనను తెలుసుకున్నారు.. ప్రశ్నించే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తారు.. అరెస్టులు చేసి నోళ్లు మూయిస్తారని హరీష్ రావు అన్నారు. నేడు యావత్ తెలంగాణ ఏకమై మీ దుర్మార్గ పాలనను నిలదీస్తున్నది.. అడుగడుగునా ప్రశ్నిస్తున్నది.. మరి ఇప్పుడు వారిపై ఎన్ని కేసులు పెడతారు.. ఎంత మందిని అరెస్టులు చేస్తారు అని ప్రశ్నించారు. మీ రాక్షస పాలనలో విసిగి, వేసారి పోయిన తెలంగాణ ప్రజలు ఉప్పెనగా ఉద్యమించక ముందే కళ్లు తెరవండి.. ప్రతిపక్షాల మీద బురదజల్లడం మాని పరిపాలన మీద దృష్టి సారించండని తెలిపారు. ఎన్నికల హామీలో చెప్పినట్లుగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందజేయాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు.