C Ramachandra Reddy: మాజీ మంత్రి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత చిలుకూరి రామచంద్రారెడ్డి(81) కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో రామచంద్రారెడ్డిని మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా గురువారం గుండెపోటు రావడంతో రామచంద్రారెడ్డి తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు, పలువురు ప్రముఖులు రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో తలమడుగు మండలంలోని స్వగ్రామం కోదడ్‌లో శుక్రవారం జరగనున్నాయి.
చిలుకూరి రామచంద్రా రెడ్డి 1978, 1985, 1989, 2004లో నాలుగు సార్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇందులో రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయగా అనంతరం కాంగ్రెస్‌లో చేరి కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కేబినెట్‌లో మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. 2009, 2012లలో మాత్రం పోటీ చేసి ఓటమి పాలయ్యారు రామచంద్రా రెడ్డి. ఆయన మృతితో కాంగ్రెస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది. ఆయన మరణం ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌కి తీరని లోటుగా కాంగ్రెస్ సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. .
సీఎం సంతాపం
ఉమ్మడి రాష్ట్రంలో మాజీ మంత్రి, అదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, చిలుకూరి రామచంద్రా రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఆదర్శవంతమైన రాజకీయాలతో ప్రజాదరణ పొందిన నేతగా వారు అందించిన స్పూర్తి గొప్పదని సీఎం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాజీ మంత్రి సి. రామచంద్రారెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారిని సీఎం ఆదేశించారు.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి సి. రామచంద్రా రెడ్డి అత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రామచంద్రారెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వపరంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.