NTV Telugu Site icon

Anil Kumar Yadav: పార్టీ మారుతున్నారనే వార్తలపై మాజీ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ క్లారిటీ!

Anil Kumar Yadav

Anil Kumar Yadav

Anil Kumar Yadav: తాను పార్టీ మారుతానని కొన్ని మీడియా ఛానళ్లలో దుష్ప్రచారం చేస్తున్నారని.. ఆయా ఛానళ్లు తమ వ్యూస్ కోసమే ఇలా చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. నాది వైసీపీ కాదు. నాది జగన్ పార్టీ అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. జగన్ ఎలా ఉంటే అలా ఉంటానని స్పష్టం చేశారు. కొన్ని వ్యక్తిగత పనుల వల్ల రాజకీయాలకు కొన్ని రోజులుగా దూరంగా ఉన్నానని అనిల్ కుమార్‌ యాదవ్ వెల్లడించారు. ఒకవేళ రాజకీయాలకు దూరం కావాల్సి వస్తే ఏ పార్టీ వైపు కూడా వెళ్లనన్నారు. త్వరలోనే చురుగ్గా రాజకీయాల్లో పాల్గొంటానన్నారు. తనను ఏదో విధంగా కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టాలని నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

Read Also: YS Jagan: సూపర్‌-6 హామీల విషయంలో ప్రభుత్వం ఫెయిల్‌.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

దీనికోసం లోకేష్ చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని.. ఎందరో మహామహులు జైలుకు వెళ్లారని.. జైలును చూసి భయపడనని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. జిల్లాలో శునకానందం పొందుతున్న కొందరు అధికారంలోకి వచ్చామని.. తమకు మించిన వీరులు లేరని అనుకుంటున్నారన్నారు. ఇలా అనుకున్న ఎందరో కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు. తాను ఇంకా యువకుడినే అని, మేం మళ్ళీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు తడాఖా చూపిస్తామన్నారు. పల్నాడుకు వెళ్లి పోటీ చేసిన తర్వాత అక్కడ ప్రజలు ఎంతగానో ఆదరించారని చెప్పారు. ఎమ్మెల్యేల కంటే 40 వేల ఓట్లు అధికంగా తనకు వచ్చాయన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని వారిపై దాడులు చేస్తున్నారని.. తాను ఆ ప్రాంతంలో పర్యటిస్తే వారిపై దాడులు చేస్తారని అనుకుంటున్నామన్నారు. అందువల్లే దూరంగా ఉంటున్నానన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడమన్నారు. ఇచ్చింది డబుల్ గానే తిరిగి చెల్లిస్తామని మాజీ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ హెచ్చరించారు.