AK Goyal: తెలంగాణలో ఎన్నికల వేళ దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండగా మరోవైపు ప్రముఖుల ఇళ్లపై దర్యాప్తు సంస్థలు వరుసగా తనిఖీలు నిర్వహిస్తుండడం ఆసక్తికరంగా మారింది. మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 22లోని ఏకే గోయల్ ఇంట్లో ఎన్నికల బృందం, టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల వేళ.. అధికార పార్టీ అభ్యర్థులకు భారీగా డబ్బులు గుంజినట్లు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణల మేరకు అధికారులు సోదాలు నిర్వహించారు. ఏకే గోయల్ నివాసంలో అధికారులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏకే గోయల్ ఇంటికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో ఆ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Also Read: Raithubandhu: రైతులకు గుడ్‌న్యూస్.. రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ అనుమతి
అయితే, మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఏకే గోయల్ నివాసంలో అధికారులు సోదాలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్ని రోజులు రాజకీయ నేతలు, వ్యాపారుల ఇళ్లలో మాత్రమే తనిఖీలు జరిగాయి… ఇప్పుడు బీఆర్‌ఎస్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఇంట్లో ఇలా జరగడం హాట్ టాపిక్‌గా మారింది. జూబ్లీహిల్స్ ఏకే గోయల్ ఇంటికి ఐటీ అధికారులు కూడా చేరుకున్నారు. మాజీ ఐఏఎస్ ఏకే గోయల్‌కి ఐటీ సెర్చ్ వారెంట్ ఇవ్వనుంది. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్‌తో పాటు ఐటీ కూడా తనిఖీలు చేయనుంది. రెండు గంటలుగా ఏకే గోయల్‌ను ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రశ్నిస్తోంది.