Ex CMs Vijay Rupani, Suresh Mehta escape from Road Accident: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రులు విజయ్ రూపానీ, సురేశ్ మెహతా రోడ్డు ప్రమాదాల నుంచి త్రుటిలో బయటపడ్డారు. సోమవారం వేర్వేరు చోట్ల ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రమాదాల్లో గుజరాత్ మాజీ సీఎంకు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. ఈ విషయాన్ని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సీపీ ముంధ్వా తెలిపారు.
సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో విజయ్ రూపానీ కాన్వాయ్ అహ్మదాబాద్, రాజ్‌కోట్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. సురేంద్రనగర్ జిల్లా లింబ్డి పట్టణం సమీపంలో 50 ఏళ్ల ప్రభు థాకర్షి అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతుండగా.. మాజీ సీఎం కాన్వాయ్‌లోని ఓ కారు అతడి బైక్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో మాజీ సీఎం రూపానీ వేరే కారులో ఉన్నారు. గాయపడిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వ్యక్తిని విజయ్ రూపానీ తన కాన్వాయ్ వాహనంలో ఎక్కించుకుని లింబ్డీలోని ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఎటువంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడలేదని సీపీ ముంధ్వా తెలిపారు. పంజాబ్‌లో బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రూపానీ.. రాజ్‌కోట్ నుంచి గాంధీనగర్‌కు వెళ్తున్నారు. ఇక మాజీ సీఎం సురేశ్ మెహతా కారును మోర్బీ జిల్లా హల్వద్ పట్టణం సమీపంలో ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.