ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. నేడు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ కమిటీలను వేయాలని నిర్ణయించారు. కమిటీలకు ఇన్‌ఛార్జిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు.
పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరీ అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా కేసీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజల కోసం పోరాటాలు చేయాలని సూచించారు. ఉద్యమం, తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన కృషిని వివరించారు. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ కోసం పోరాడగలదని.. ప్రజల కష్టాలు బీఆర్‌ఎస్‌కు మాత్రమే తెలుసన్నారు. వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తామని మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కిపోతోందని.. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు.
READ MORE:YS Jagan: చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్‌కు వైఎస్ జగన్ పరామర్శ