TG SAFE: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని డైరీ ప్రొడక్ట్స్ తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్ (TG SAFE), ఫుడ్ వింగ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. క్వాలిటీని గాలికొదిలేసి నాసిరకం ఉత్పత్తులను విక్రయిస్తున్న డైరీ సంస్థల తీరు ఈ తనిఖీల్లో వెలుగుచూసింది. మధుర, యశోద, బాలాజీ, జగన్నాథ్ డైరీ ప్రొడక్ట్స్ కేంద్రాలపై అధికారులు ముమ్మరంగా సోదాలు జరిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం 6 డైరీ యూనిట్లు, ఒక ట్రాన్స్పోర్ట్ కేంద్రంలో ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఈ సోదర్లలో అపరిశుభ్ర వాతావరణంలో డైరీ ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు తేలింది. ఎలాంటి ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్ లేకుండానే గుట్టుచప్పుడు కాకుండా ఈ యూనిట్లు నడుస్తున్నట్లు గుర్తించారు. సరైన నిల్వ వసతులు లేకపోవడంతో పాటు, ఉష్ణోగ్రత నియంత్రణ పాటించకుండా డైరీ ప్రొడక్ట్స్ను నిల్వ చేస్తున్నారు. కోల్డ్ స్టోరేజ్ వాహనాలను ఉపయోగించకుండా, ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి బస్సులు, డీసీఎంల (DCMs) ద్వారా హైదరాబాద్కు అక్రమ రవాణా చేస్తున్నట్లు అధికారులు తేల్చారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తున్న 3.6 టన్నుల కల్తీ కోవాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన పలు డైరీ యూనిట్లను సీజ్ చేయడంతో పాటు, మరికొన్నింటికి షోకాజ్ మరియు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు.

