Gaddar: ప్రజా గాయకుడు గద్దర్ తన స్వరంతో కోట్లాది మంది ప్రజల్లో చైతన్య జ్వాలలను రగిల్చారు. చావుకు దగ్గరలో ఉన్నప్పుడు, చివరి క్షణాల్లో కూడా పాటను మాత్ర వదల్లేదు. అపోలో స్పెక్ట్రా ఆస్పత్రి ఐసీయూలోనూ పాటలు పాడారని మీడియాకు చెబుతూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గద్దర్ సాహిత్యాన్ని , స్వరాన్ని ఎన్నటికీ మరువలేమని నెటిజన్లతో పాటు ప్రజా సంఘాలు, విప్లవ కారులు, ప్రముఖులు ఎమోషన్ అవుతున్నారు. గద్దర్ మరణంతో ఆయన ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ ప్రజానీకం, విప్లవకారులు, ఉద్యమకారులు, రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా గద్దర్‌కు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Gaddar Passes Away: ప్రజా గాయకుడు గద్దర్ జీవిత విశేషాలు.. మూగబోయిన ఉద్యమ గళం
గద్దర్ తన పాటతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. గద్దర్ కేవలం పోరాట స్ఫూర్తిని నింపే పాటలను మాత్రమే కాకుండా.. ఆడపిల్లల బాధలను కూడా తన పాట రూపంలో ఆవిష్కరించారు. ఆడబిడ్డకు పుట్టినప్పటి నుంచే కష్టాలే అని రాసి ఆయనే పాడిన ” నిండు అమాస నాడు ఓ లచ్చ గుమ్మడి’ అంటూ రాసిన పాట వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఇలా ఆడపిల్లల పైనే కాకుండా రైతులు, వ్యవసాయం, పుడమి తల్లి మీద పాటలు రాసి ఆలపించి చాలా మంది గుండెల్లో పాట రూపంలో కొలువున్నారు ప్రజా యుద్ధనౌక గద్దర్.