ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని కొండాయి విషాదంలో మునిగిపోయింది. కురిసిన భారీ వర్షాలతో జంపన్న వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఒక్కసారిగా కొండాయి ముంచెత్తిన వరద ఎనిమిది మంది ప్రాణాలను బలిగొంది. 250 కుటుంభలను బయబ్రాంతుకు గురిచేసింది. వర్షాలు, వరదలు కొండాయ్గ్రామస్థులకు కొత్తేం కాదు. గతంలో ఎన్నోసార్లు వరదలు గ్రామాన్ని చుట్టిముట్టినా ఈసారి మాత్రం తీరని విషాదాన్ని మిగిల్చాయి. వరద పెద్దగా రాదని తొలుత భావించిన గ్రామస్థులు.. అనంతరం వాగు ఉద్ధృతి చూసి ఆందోళనకు గురయ్యారు. గ్రామాన్ని ముంచెత్తుతుందని భయపడి ప్రాణాలు కాపాడుకునేందుకు తలోదిక్కుకు పరిగెత్తారు. కొందరు మాల్యాల, గోవిందరాజుల గ్రామాల వైపు వెళ్లారు. మరికొందరు స్థానిక ఆశ్రమం, పాఠశాల భవనం, గ్రామ పంచాయతీ భవనాలెక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. కొండాయ్, మాల్యాల గ్రామాల మధ్య కొత్తగా కల్వర్టు నిర్మించగా.. వరద ఉద్ధృతికి కోతకు గురైంది. దీంతో ఎనిమిది మంది రోడ్డును అనుకుని ఆ గుంతలో పడి… కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు.
ప్రజలు ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకొని తమను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా కొండాయి లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్ర విషాదంలో నింపింది.గురువారం నాడు వరదల్లో కొట్టుకుపోయి గల్లంతైన వారంతా విగత జీవులుగా మారటం అక్కడివారిని శోకసంద్రంలో ముంచేసింది. దృష్టిలో పెట్టుకొని ఊరు మునుగుతుందేమోనన్న భయంతో సురక్షిత ప్రాంతానికి వెళ్దామనుకుని బయలుదేరిన వారు జంపన్న వాగు నీళ్లలో మునిగిపోయారు. ఈ విషాద ఘటనలో ఇప్పటివరకు ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు
కొండాయి గ్రామానికి చెందిన మహమ్మద్ మజీద్ ఖాన్, ఆయన భార్య లాల్ బిబి, షేక్ మహబూబ్ ఖాన్, ఆయన కుమారుడు అజార్, మహమ్మద్ రషీద్ ఆయన భార్య కరీమా, కొండాయి గోవిందరాజులు దేవాలయ ప్రధాన పూజారి తల్లి దబ్బ కట్ల సమ్మక్క తదితరులు వరద ప్రవాహంలో కొట్టుకుపోగా రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి ఎనిమిది మంది మృతదేహాలు వెలికి తీశారు.
వీరంతా వరద పెరుగుతున్న సందర్భంగా మల్యాల గ్రామానికి వెళుతున్న క్రమంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు వెంట నడుస్తూ రెండు గ్రామాల మధ్యకు రాగానే హఠాత్తుగా ఒక్కసారిగా వరద ముంచెత్తి, ఆ వరదలో కొట్టుకుపోయారు. గల్లంతయిన వారిలో రషీద్ గజ ఈతగాడు అయినప్పటికీ వరద ఉధృతిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయాడు. కొండాయి మల్యాల మధ్యన కొత్త కల్వర్టు నిర్మించగా, ఆ కల్వర్టు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో అక్కడ రోడ్డే ఉందని భావించిన వారందరూ అందులో పడి కొట్టుకుపోయారు.
అమ్మానాన్నతో పాటు అన్నీ పోయి సర్వం కోల్పోయా మని వరద మృతులు బోరున విలపించారు. ఇంట్లో కిరాణ సామగ్రంతా, వస్తువులన్నీ వరదలో పోయాయి. ఇల్లు కూడా కూలిపోయింది.మేమేం పాపం చేశాం దేవుడా’ అంటూ మృతుల కుటుంబ సభ్యులు రోదించారు. అభం శుభం తెలియని తమ వారిపై ప్రకృతి కన్నెర్ర చేసిందని, తమ వారిని పొట్టనపెట్టుకుంది అని గిరిజన గ్రామ ప్రజలు వాపోతున్నారు.