Fire Accident: నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుపతి పట్టణంలోని గోవిందరాజ స్వామి దేవాలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో… మొదట ఫోటో ఫ్రేమ్ షాపులో మంటలు చెలరేగాయి. వెంటనే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. మూడు అంతస్తుల భవనం మొత్తం మంటల్లో చిక్కుకుంది. ఆ ప్రాంతం భక్తులతో కిటకిటలాడడంతో చుట్టుపక్కల వారందరూ పరుగులు తీశారు.
Read Also:Ambati Rambabu: ఏ విషయంలోనూ స్పష్టత లేని వ్యక్తి పవన్.. రాజకీయాలకు పనికిరాడు..
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో పాటు గాలి వీస్తుండడంతో మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. అగ్నిప్రమాదం జరిగిన భవనం చుట్టూ ఎక్కువగా దుకాణాలు ఉన్నాయి. ఫోటో ఫ్రేమ్ షాపులు, పూజ సామాగ్రిని విక్రయించే దుకాణాలు ఉన్నాయి. దీంతో పరిసర ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రమాద ప్రాంతం నుంచి ప్రజలను బయటకు పంపుతున్నారు. ఆరు ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకర్లతో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ఎవరూ భయపడవద్దని స్థానికులు కోరుతున్నారు.
Read Also:Andhra Pradesh: రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టిన సెల్ ఫోన్.. కత్తులు, కర్రలతో దాడి..
మరోవైపు ఈ భవనం పక్కనే గోవిందరాజు స్వామి ఆలయ రథం ఉంది. మంటలు రథాన్ని అంటుకుంటున్నాయి. అగ్నిప్రమాదంతో మాడ వీధుల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటలు చెలరేగడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.