Indiana Jones: హాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్స్ గా జేజేలు అందుకున్న స్టీవెన్ స్పీల్ బర్గ్, ఆయన మిత్రుడు జార్జ్ లూకాస్ కలసి తెరకెక్కించిన ‘ఇండియానా జోన్స్’ ప్రపంచ వ్యాప్తంగా సినీ ఫ్యాన్స్ ను అలరించింది. ఇప్పటికి నాలుగు భాగాలుగా రూపొందిన ‘ఇండియానా జోన్స్’ ఫ్రాంచైజ్ లో ఐదో చిత్రంగా ‘ఇండియానా జోన్స్ అండ్ ద డయల్ ఆఫ్ డెస్టినీ’ 2023 జూన్ 30న విడుదల కానుంది. కానీ, ఈ చిత్రానికి ఆ ఇద్దరు గ్రేట్ డైరెక్టర్స్ పనిచేయలేదు. కానీ, వారి ప్రభావంతో జేమ్స్ మ్యాన్ గోల్డ్ ఈ తాజా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ట్రైలర్ శుక్రవారం విడుదలయింది.
‘ఇండియానా జోన్స్’ తొలి భాగంగా 1981లో రూపొందిన ‘ రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్’ లో హీరోగా నటించిన హారిసన్ ఫోర్డ్ తరువాత రూపొందిన ఫ్రాంచైజ్ లోనూ, తాజా చిత్రం ‘ఇండియానా జోన్స్ అండ్ ద డయల్ ఆఫ్ డెస్టినీ’లోనూ కథానాయకుడుగా కనిపించడం విశేషం! మొదటి భాగం తరువాత 42 సంవత్సరాలకు తెరకెక్కిన తాజా చిత్రంలోనూ హారిసన్ ఫోర్డ్ తనదైన పంథాలో నటించారు. “ఐ మిస్ ద డెజర్ట్… ఐ మిస్ ద సీ…” అంటూ ఈ ట్రైలర్ మొదలవుతుంది.ట్రైలర్ చివరలో “హూ ఈజ్ దిస్ మేన్?” అంటూ ఒకరు ప్రశ్నించగా, “ఐ యామ్ హర్ గాడ్ ఫాదర్…” అంటూ హారిసన్ ఫోర్డ్ సమాధానమిస్తారు. తరువాత తన కొరడా ఝళిపిస్తూ “గెట్ బ్యాక్…” అంటూ వార్నింగ్ ఇస్తారు హారిసన్. అందరూ ఆయనవైపు పిస్తోళ్ళు గురిపెడతారు. వారి రివాల్వర్స్ గర్జిస్తాయి, వాటి గుళ్ళ నుండి తనను తాను రక్షించుకుంటాడు హీరో. అలా ఈ ట్రైలర్ రూపొందింది.
‘ఇండియానా జోన్స్’ టైటిల్ లోనే మన ‘ఇండియా’కు సంబంధం ఉందనిపిస్తుంది. అందువల్లే ఈ సినిమా అంటే భారతీయులకూ ఆసక్తి. ఈ చిత్రం రెండో భాగంగా రూపొందిన ‘ఇండియానా జోన్స్ అండ్ ద టెంపుల్ ఆఫ్ ద డూమ్’ భారతదేశంలో నిషేధానికి గురయింది. అప్పట్లో అదో సంచలనం. ఈ సినిమా నాలుగో భాగంగా 2008లో ‘ఇండియానా జోన్స్ అండ్ ద కింగ్ డమ్ ఆఫ్ క్రిస్టల్ స్కల్’ తెరకెక్కింది. అంటే దాదాపు 15 ఏళ్ళ తరువాత ‘ఇండియానా జోన్స్’ మరో భాగం ప్రేక్షకులను ఇప్పుడు పలకరిస్తోందన్న మాట! మరి ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంటుందో తేలాలంటే 2023 జూన్ 30 దాకా ఆగాల్సిందే!