Father Sold Blood For Daughter Treatment: విధి ఆ కుటుంబంపై పగబట్టింది. చదువులో అద్భుతంగా రాణిస్తున్న కూతురికి ఉన్నట్టుండి ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో వెన్నెముక దెబ్బతినడంతో మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. అప్పటిదాకా ఎంతో ఆనందంగా ఉన్న ఆ కుటుంబం ఒక్కసారిగా కష్టాల్లో పడింది. కూతురి వైద్యం కోసం భూములతో పాటూ చివరకు ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. ఆఖరికి తన ఒంట్లోని రక్తం కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. విధి పెట్టిన పరీక్షను తట్టుకోలేక ఆ తండ్రి ఊహించలేని నిర్ణయాన్ని తీసుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ట్రాన్స్‌పోర్ట్ నగర్‌కు చెందిన ప్రమోద్ గుప్తా అనే వ్యక్తికి అనుష్కా గుప్తా అనే కుమార్తె ఉంది. ప్రమోద్ స్థానికంగా ఓ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. భార్య, పిల్లలలో సంతోషంగా ఉన్న వీరి కుటుంబంపై విధి చిన్న చూపు చూసింది. ఐదేళ్ల క్రితం ప్రమోద్ గుప్తా కూతురు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి ఆమె ప్రాణాలతో బయపడ్డా.. వెన్నెముక దెబ్బతినడంతో మంచానికే పరిమితమైంది. కూతురును మామూలు మనిషిని చేయడానికి ప్రమోద్.. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎన్నో ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం మాత్రం లేదు.
Read Also: Tragedy : లండన్ బీచ్ లో కొట్టుకుపోయిన హైదరాబాద్ అమ్మాయి
అప్పటివరకు దాచుకున్న డబ్బుతో పాటు ఆస్తులు, దుకాణం, ఇల్లు కూడా అమ్ముకున్నాడు. అయినా కూతురు ఆరోగ్యం మాత్రం మెరుగు కాలేదు. దీంతో ప్రమోద్ తీవ్రంగా కుంగిపోయాడు. అనుష్కా గుప్తా పదో తరగతిలో జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఆమెను ఘనంగా సన్మానించారు. ప్రభుత్వం నుంచి ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ వారి నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఇటీవల ప్రమోద్ ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఇంటి సరుకుల కోసం ప్రమోద్.. తన రక్తాన్ని కూడా విక్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో మరింత కుంగిపోయి మంగళవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. వేకువజామున కూతురికి ఫోన్ చేసి.. తనకు చావు తప్ప వేరే మార్గం కనిపించడం లేదని చెప్పి ఫోన్ పెట్టేశాడు. తర్వాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రమోద్ వార్త తెలియగానే స్థానికంగా విషాదం నెలకొంది.
Read Also: Anurag Maloo: సజీవంగా దొరికిన మౌంటెనీర్ అనురాగ్ మాలూ.. పరిస్థితి విషమం
తన కోసం తండ్రి ఎంతో కష్టపడ్డాడని కూతురు గుండెలవిసేలా రోధించింది. తన చికిత్స కోసం తన తండ్రి ప్రమోద్ తన ఇంటిని, తన దుకాణాన్ని అమ్మి కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కుకున్నాడని అనుష్క గుప్తా తెలిపింది. గ్యాస్ సిలిండర్, ఆహారం కోసం ప్రమోద్ కొన్ని సార్లు రక్తదానం చేశాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన తండ్రి రక్తం అమ్ముకుని అనారోగ్యం పాలయ్యాడని, డబ్బు సంపాదించలేకపోయాడని అనుష్క చెప్పింది.