ఢిల్లీలో రైతులు మళ్లీ పోరుబాట పడుతున్నారు. మొత్తం 23 వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ఛలో చేపట్టేందుకు రెడీ అయ్యారు. శాంతియుతంగా దేశ రాజధానికి పాదయాత్ర కొనసాగిస్తామని రైతులు చెబుతున్నప్పటికీ.. అందుకు ఏమాత్రం అనుకూల పరిస్థితులు కనిపించట్లేదు.. రైతులను అడ్డుకునేందుకు మూడు అంచెల వ్యవస్థతో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. దీంతో ఢిల్లీ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Read Also: Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు తాత్కాలిక విరామం!
ఇక, కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో నాలుగు సార్లు చర్చలు చేసింది. అయితే నాలుగో విడత చర్చల్లో.. పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తికి ఐదేళ్ల పాటు కనీస మద్దతు ధర ఒప్పందం చేసుకుంటామని కేంద్ర సర్కార్ ప్రతిపాదించింది. అయితే, అన్ని పంటలకు కనీస మద్దతు ధర గ్యారెంటీ కల్పించాల్సిందేనని రైతు సంఘాల నేతలు పట్టుబడుతున్నారు. దీంతో చర్చలు విఫలం కావడంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. ఇక, ఢిల్లీ వైపు వెళ్లే.. పంజాబ్ – హర్యానా సరిహద్దు దగ్గర రైతులను పోలీసులు నిలువరిస్తున్నారు. ఒకవైపు సిమెంట్ కాంక్రీట్ దిమ్మెలతో పాటు ముళ్ల కంచెలతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Read Also: Stock Market Opening: చరిత్ర సృష్టించిన స్టాక్ మార్కెట్.. తొలిసారిగా 22,248కి చేరిన నిఫ్టి
అలాగే, తొలి రోజు జరిగిన పరిస్థులను దృష్ట్యిలో పెట్టుకున్న రైతులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన కంచెలను బద్దలు కొట్టేందుకు జేసీబీలు, వాటిని నడిపేవాళ్లపై టియర్ గ్యాస్ ప్రభావం పడకుండా ప్రత్యేక ఇనుప కవచాలు, జనపనార బస్తాలతో రైతులూ సిద్ధమయ్యారు. శంభు సరిహద్దు దగ్గర 1,200 ట్రాక్టర్లు, 14 వేల మంది రైతులు మోహరించినట్లు కేంద్ర హోంశాఖ నివేదికలో తెలిపింది. తక్షణమే వాళ్లపై చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, బీజేపీ, ఎన్డీఏ ఎంపీల ఇళ్ల ముందు కూడా నల్ల జెండాలతో ఆందోళన చేయాలని రైతుల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. ఇక, పంజాబ్‌లోని బీజేపీ నేతల ఇళ్లను ముట్టడిస్తామని ఎస్‌కేఎమ్ ఇప్పటికే వెల్లడించింది. దీంతో బీజేపీ నేతల ఇళ్ల దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతాను ఏర్పాటు చేశారు.