Kamareddy Tragedy : కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నేలతల్లిని నమ్ముకున్న రైతు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరుగాలం కష్టించిన పంటకు నష్ట పరిహారం అందించాలని అధికారుల చుట్టూ తిరిగాడు.. స్పందన లేకపోవడంతో కుటుంబాన్ని పోషించలేక సెల్ టవరెక్కి ఉరేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగారం గ్రామానికి చెందిన పుట్ట ఆంజనేయులు అనే రైతు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకన్న ఘటన అందిరినీ కంటతడి పెట్టిస్తోంది. పుట్ట ఆంజనేయులుకు గ్రామ చెరువు ఆయకట్టు పరిధిలో కొంత భూమి ఉంది. ఆ భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అలా కొంతకాలంగా ఆ భూమిలో పంటలు సాగుచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.
Read Also: Good News For Farmers : ఒకసారి వరి నాటువేస్తే.. నాలుగేళ్లు 8సార్లు కోసుకోవచ్చు
అప్పులు చేసి తన పొలంలో పంట సాగు చేశాడు. చెరువులోంచి పొలాలకు వచ్చే నీరంతా తన పంట పొలం నుంచే వెళ్తుండడంతో ఆంజనేయులు పొలంలోని పంట చేతికందకుండా పోతోంది. దీంతో తన పంటకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని కొన్ని రోజలుగా అధికారుల చుట్టూ తిరుగుతూ వారిని ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ అధికారులెవరూ రైతు ఆంజనేయులు వినతిని పట్టించుకోలేదు. అప్పులు ఏలా తీర్చాలో తెలియక, కుటుంబ పోషణ భారమై తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అధికారుల తీరుకు నిరసనగా సెల్‌టవర్ ఎక్కాడు. ఆంజనేయులు సెల్‌టవర్ ఎక్కాడన్న సమాచారం అందుకున్న భార్య పిల్లలు వెంటనే అక్కడికి చేరుకున్నారు. నాన్న కిందకు దిగి రావాలని పిల్లలు వేడుకున్నారు. గుక్కపట్టి ఏడ్చారు. కానీ అప్పటికే ఆంజనేయులు టవల్‌తో ఉరివేసుకున్నాడు. తండ్రి చనిపోయాడని తెలియక.. పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు. ఈ హృదయవిదారక ఘటన అందర్నీ కలచివేసింది.