హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ మండలం తొల్కట్ట ఫామ్‌హౌస్‌లో క్యాసినో, కోడిపందేల నిర్వహణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కోడిపందేలు జరిగిన ల్యాండ్ శ్రీనివాస్‌కి చెందినదిగా నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. మాదాపూర్‌లోని శ్రీనివాస్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేసిన పోలీసులు.. కోడిపందేల నిర్వహణపై సమగ్ర వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. తోల్కట్ట గ్రామం సర్వే నెంబర్ 165/aపై నాలుగు రోజుల్లో ఆధారాలతో తమ ముందు హాజరుకావాలని పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు.
క్యాసినో, కోడిపందేల నిర్వహణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని మొయినాబాద్ పోలీసులు నిందితుడిగా చేర్చారు. సెక్షన్ 3 అండ్ 4 గేమింగ్ యాక్ట్ తో పాటు సెక్షన్ 11 యానిమల్ యాక్ట్ కింద్ కేసు నమోదు చేశారు. ఫామ్‌హౌస్‌ను భూపతిరాజు అనే వ్యక్తికి లీజుకు ఇచ్చామని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చెబుతున్న నేపథ్యంలో.. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం ఇవ్వాలని పోలీసులు ఆయనకు ఈరోజు నోటీసులు ఇచ్చారు.
Also Read: Microsoft: హైదరాబాద్ జర్నీలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్ ప్రారంభం మరో మైలురాయి: సీఎం
తొల్కట్ట ఫామ్‌హౌస్‌లో మంగళవారం పోలీసులు నిర్వహించిన దాడుల్లో మొత్తం 64 మంది పట్టుబడిన విషయం తెలిసిందే. ఆర్గనైజర్లు భూపతి రాజు, శివకుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫామ్‌హౌస్‌పై దాడిలో 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు, 86 పందెం కోళ్లు, బెట్టింగ్ కాయిన్స్, పేకాట కార్డ్స్, పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 64 మందిలో 51 మంది ఏపీ వారే ఉన్నారు. ఏడు మంది హైదరాబాద్ నగరంకు చెందిన వారున్నారు.