Ketu Viswanatha Reddy is no more: ప్రముఖకవి, రచయిత, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథ్ రెడ్డి ఈ రోజు ఉదయం కన్నుమూశారు.. ఆయన వయస్సు 88 ఏళ్లు.. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సంఘమిత్ర హాస్పిట్‌లో చికిత్స పొందుతూ ఉదయం 5 గంటల సమయంలో కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు విడిచారు విశ్వనాథ్ రెడ్డి.. రచయితలు, సాహితీవేత్తలు, కవుల సందర్శనార్థం ఈరోజు ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నారు.. అమెరికాలో ఉన్న తన కుమారుడు ఈ రోజు ఒంగోలుకు చేరుకొని తండ్రి పార్థీవ దేహాన్ని కడపకు తీసుకెళ్తారని తెలుస్తోంది.. ఆయన అంత్యక్రియలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.. కాగా, విశ్వనాథ్ రెడ్డి 2 రోజుల క్రితం ఒంగోలులోని తన కుమార్తె ఇంటికి వెళ్లారు.. అక్కడ అస్వస్థతకు గురికాగా.. వెంటనే కుటుంబసభ్యులు ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఇక, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు విశ్వనాథ్ రెడ్డి..
మరోవైపు.. ప్రముఖ కథా రచయిత కేతు విశ్వనాథ్ రెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ఆధునిక తెలుగు సాహితీ రంగానికి విశ్వనాథ్ రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్న ఆయన.. సామాజిక సంస్కరణలను అవశ్యకతను చెబుతూ విశ్వనాథ్ రెడ్డి రాసిన కథలు పలువురికి స్ఫూర్తిగా నిలిచాయన్నారు.. ఆయన సేవలను గుర్తించి 2021లో వైయస్సార్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డుతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని సత్కరించిందనే విషయాన్ని గుర్తుచేసుకున్న సీఎం వైఎస్ జగన్.. విశ్వనాథ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
కాగా, విశ్వనాథ్ రెడ్డికి ఆయన రచనలు ఎన్నో అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టాయి.. కడప జిల్లా గ్రామనామాలు అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకుగాను డాక్టరేట్ పొందారు. పాత్రికేయుడుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి కడప, తిరుపతి, హైదరాబాద్ లాంటి చోట్ల అధ్యాపకుడుగా పనిచేసి ఆయన.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. ఇక, విశ్వనాథ్ రెడ్డి తొలి కథ అనాదివాళ్ళు 1963లో సవ్యసాచిలో ప్రచురితమైంది. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించారు. విశాలాంధ్ర తెలుగు కథ సంపాదక మండలికి అధ్యక్షుడుగా ఉన్నారు. ఆయన కథలు.. హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్ భాషల్లోకి అనువదించడబ్బాయి.. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు (న్యూ ఢిల్లీ), భారతీయ భాషా పరిషత్తు (కలకత్తా), తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాద్), రావిశాస్త్రి అవార్డు, రితంబరీ అవార్డు.. సహా ఎన్నో అవార్డులను అందుకున్నారు కేతు విశ్వనాథ్ రెడ్డి.