Rajahmundry Central Prison: రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయన కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. ఈ సారి నందమూరి రామకృష్ణ, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ములాఖత్‌లో చంద్రబాబును కలిశారు.. ఇవాళ ఉదయం 11 గంటలకు సెంట్రల్ జైలుకు చేరుకున్న కుటుంబ సభ్యులు.. చంద్రబాబుతో 40 నిముషాల పాటు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత తాజా పరిస్థితులపై కుటుంబ సభ్యులు ఆయనకు వివరించినట్టుగా తెలుస్తోంది.. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. మరోవైపు ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా అన్ని న్యాయస్థానాల్లో వివిధ పిటిషన్లపై విచారణలు సాగుతోన్న విషయం విదితమే.
Read Also: Bhagavanth Kesari: భగవంత్ బాదుడు… హాప్ సెంచరీ కొట్టేశాడు!
కాగా, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును గత నెల 9వ తేదీన అరెస్ట్ చేశారు సీఐడీ అధికారులు.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన రిమాండ్ 43వ రోజుకు చేరింది.. ఇక, నవంబర్ 1వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్‌ను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం పొడిగించిన విషయం విదితమే. మరోవైపు, చంద్రబాబు లీగల్ ములాఖత్‌ల వ్యవహారం కూడా కోర్టు వరకు వెళ్లిన విషయం విదితమే.. చంద్రబాబు భద్రత దృష్ట్యా రోజుకు ఒక ములాఖత్ మాత్రమే ఉంటుందని రాజమండ్రి జైలు అధికారులు స్పష్టం చేయగా.. దీనిపై ఏసీబీ కోర్టును ఆశ్రయించారు చంద్రబాబు న్యాయవాదులు.. రోజుకు కనీసం రెండుసార్లు ములాఖత్ లకు అవకాశం ఇవ్వాలని.. ఒక్కో ములాఖత్ 40-50 నిమిషాల వ్యవధి ఉండాలని చంద్రబాబు కోర్టును విన్నవించారు. పలు కేసులు ఆయనపై నమోదైన నేపథ్యంలో లాయర్లతో మాట్లాడేందుకు ఎక్కువ సమయం అవసరం అవుతుందని.. అందుకే ములాఖత్ ల సంఖ్యను పెంచాలని అభ్యర్థించారు. కేసును విచారించిన ఏసీబీ న్యాయస్థానం.. రోజుకు రెండుసార్లు ములాఖత్ అయ్యేందుకు వీలుగా అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.