Fake Doctorate Scam: డాక్టరేట్ కావాలా..? పదో తరగతి ఫెయిల్ ఐనా పర్వాలేదు.. డబ్బులిస్తే చాలు !! సమాజంలో మీకంటూ గుర్తింపు కావాలని ఆశపడుతున్నారా ? ఇంకెందుకు ఆలస్యం.. అడిగినంత ఇచ్చేయండి.. డాక్టరేట్ పొందేయండి !! ప్రతిష్టాత్మక డాక్టరేట్లను అంగట్లో సరుకులా అమ్ముతున్నాడు ఓ మేధావి. డాక్టరేట్…!! పేరుకు ముందు ఈ పదం జోడించుకోవాలి అంటే ఎంతో ఘనత సాధించి ఉండాలి. లేదా పీహెచ్‌డీ చేసి ఉండాలి. సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని వివిధ రంగాల్లో వాళ్లు చేస్తున్న కృషికి ఫలితంగా కొన్ని యూనివర్సిటీలు డాక్టరేట్లను ప్రదానం చేస్తుంటాయి. ప్రదానం చేసే యూనివర్సిటీలు కూడా చాలా ప్రాధాన్యత కలిగి ఉంటాయి. కానీ.. ఓ కేటుగాడు డాక్టరేట్లను అంగట్లో సరుకులా అమ్ముకుంటున్నాడు. డబ్బులిస్తే చాలు.. డాక్టరేట్లను చాక్లెట్లు పంచినట్లు పంచుతున్నాడు.
READ MORE: Fake Liquor: ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ట్విస్ట్..
రవీంద్ర భారతి వేదికగా జరుగుతున్న డాక్టరేట్ల ప్రదానం కార్యక్రమంలోకి సడెన్‌గా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. డాక్టరేట్లను అందజేస్తున్న పెద్దమనిషి పెద్ది యోహానును అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు కానీ అసలు విషయం బయటపడలేదు. గుర్రం జాషవా స్మారక కళా పరిషత్ పేరుతో ఫేక్ డాక్టరేట్లను ప్రదానం చేస్తున్నాడు పెద్దిటి యోహాను. డాక్టరేట్ కావాలనుకునేవాళ్లు.. పేరుకు ముందు డాక్టరేట్ అని జోడించుకోవాలని తహతహలాడుతున్న వాళ్లను టార్గెట్ చేశాడు యోహాను. డబ్బులిస్తే.. డాక్టరేట్ ఇప్పిస్తానని నమ్మించాడు. డబ్బులు తీసుకుని.. డాక్టరేట్లను ప్రదానం చేస్తున్నాడు. ఏకంగా గుర్రం జాషవా పేరును వాడేసుకున్నాడు. తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ, అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ… అని ఇలా పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుని.. కలరింగ్ ఇస్తూ… ఫేక్ డాక్టరేట్లను ప్రదానం చేస్తున్నారు.. పెద్ది యోహాను గురించి తెలియక కొంతమంది అమాయకులు ట్రాప్‌లో పడిపోతుండగా.. మరికొందరు కావాలనే డబ్బులిచ్చి మరీ డాక్టరేట్లను కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇప్పటివరకు ఎన్నిచోట్ల కార్యక్రమాలు నిర్వహించారు. ఎంతమందికి డాక్టరేట్లను ప్రదానం చేశారు..? ఒక్కొక్కరి దగ్గర ఎంతమొత్తంలో వసూలు చేశారు..? అనే వివరాలు కూపీ లాగుతున్నారు పోలీసులు. ప్రతిష్టాత్మకంగా భావించే డాక్టరేట్లను అవమానపర్చడమే కాకుండా.. చాక్లెట్లు, బిస్కెట్లు పంచినంత ఈజీగా డాక్టరేట్లు ప్రదానం చేయడంపై పలువురు సాహితీవేత్తలూ మండిపడుతున్నారు..