రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో కల్తీ చాక్లెట్స్ తయారీ చేస్తున్న కేటుగాళ్లు గుట్టు బయట పడింది. హైదర్ గూడలో సుప్రజా ఫుడ్స్ పేరుతో కల్తీ దందా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. అనూస్ ఇమ్లీ, క్యాడీ జెల్లి పేరుతో చాక్లెట్స్ తయారీ చేస్తున్నారు. ప్రమాదకర రసాయనాలు వాడుతూ చాక్లెట్స్ ను నిర్వహకులు తయారీ చేస్తున్నారు. ఇక, పరిశ్రమలో సైతం ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు కనిపించడం లేదు. దుర్గంధంలోనే చాక్లెట్ల తయారీ.. వాటికి ఆకర్షణీయమైన స్టికరింగ్ చేసి మార్కెట్ లో విక్రయం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Read Also: Maharastra: బ్రిడ్జి కింద నుంచి వెళ్తున్న ట్రైన్.. పై నుంచి పడిన కారు.. ముగ్గురు మృతి
చిన్నారుల ప్రాణాలతో కంత్రిగాళ్లు చెలగాటం ఆడుతున్నారు. కుళ్లిపోయిన చింత పండును మరిగించి వచ్చిన గుజ్జును చిన్న చిన్న ప్యాకెట్స్ లో ప్యాకింగ్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల నుండి కానీ స్థానిక జీహెచ్ఎమ్స్ అధికారుల నుండి కానీ అనుమతి లేకుండానే నిర్వాహకులు గత కొంత కాలం నుండి మురుగునీటి ప్రవాహం దగ్గరే చాక్లెట్స్ తయారీ చేస్తున్నారు. ఏమి తెలియని చిన్నారుల ప్రాణాలతో నిర్వాహకులు చెలగాటం ఆడుతున్నారు. అటు సంబంధిత అధికారులు సైతం చూసి చూడనట్లు ఊరుకుంటున్నారు. కల్తీ చాక్లెట్స్ తయారీ చేస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.