Subhash Maharia: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి సుభాష్ మహరియా కాంగ్రెస్‌ను వీడి నేడు బీజేపీలో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుభాష్ మహరియా ప్రకటించారు. ఆయన శుక్రవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరే అవకాశం ఉంది. అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌ల మధ్య వాగ్వాదం నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. సుభాష్ మహరియా 2016లో కాంగ్రెస్‌కు మారడానికి ముందు బీజేపీలో ఉన్నారు. ఆయన 2019లో సికర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి స్వామి సుమేదానంద సరస్వతి చేతిలో ఓడిపోయారు.
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాజస్థాన్‌లోని 25 సీట్లలో 24 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా.. రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD) కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదు. సికార్ పార్లమెంటరీ స్థానంలో కాంగ్రెస్ ఓడిపోయిన నేపథ్యంలో పార్టీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన లేఖలో సుభాష్ మహరియా ఆరోపించారు. 2019లో రాజస్థాన్‌లోని మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అయినప్పటికీ ఎలాంటి సమీక్షా సమావేశం నిర్వహించలేదని లేఖలో ఆయన పేర్కొన్నారు, దాని కాపీని తన ట్విట్టర్ హ్యాండిల్‌కు జత చేశారు.
Read Also: Tina Dabi: పాక్ హిందూ శరణార్థుల నివాసాలు బుల్డోజర్‌తో కూల్చివేత.. మరోసారి వార్తల్లో టీనా దాబి
సికార్‌లోని కాంగ్రెస్ కార్యకర్తలు అవమానాలను ఎదుర్కొంటున్నారని సుభాష్ మహరియా నొక్కిచెప్పారు. అటువంటి పరిస్థితిలో తాను ఇకపై పార్టీలో ఉండటం సాధ్యం కాదన్నారు.ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, రైతులు, యువతతో సహా ప్రజలు మోసపోయారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం కాంగ్రెస్ మర్చిపోయిందని, రాష్ట్రంలో రైతుల రుణాలు మాఫీ చేయలేదని, యువతకు ఉపాధి కల్పించలేదని, కాంగ్రెస్‌కు ఓటు వేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సుభాష్ మహరియా 1999 నుండి 2004 వరకు ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. అతను సికార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు.. 1998, 1999, 2004లో గెలిచారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.