మాజీ యూనియన్ బ్యాంక్ మేనేజర్ దావులూరి ప్రభావతి ఆగడాలు ఇంకనూ ఆగడం లేదు. గతంలో పెనమలూరు నియోజకవర్గం గంగూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్‌గా పని చేసిన ప్రభావతిపై చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. నూజివీడు మండలం మర్రిబంధం గ్రామంకు చెందిన కవులూరి యోగేశ్వరరావుకు చెందిన బంగారు ఆభరణాలతో వడ్డాణం చేయిచుకున్న ఆమెపై ఫోర్జరీ కేసు నమోదైంది. ఈ కేసు నడుస్తుండగానే తాజాగా ప్రభావతి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ వ్యక్తిని కట్టేసి కొట్టి.. తననే కొట్టారని నాటకమాడారు.
నూజివీడు మండలం మర్రిబందం గ్రామంకు చెందిన దోనవల్లి వెంకట్రావును వాటర్ ట్యాంక్ వద్ద కట్టేసి దావులూరి ప్రభావతి కొట్టారు. ఇందుకు తన తండ్రి, తనయుడి సాయం తీసుకున్నారు. వెంకట్రావును కొట్టి.. తనను కొడుతున్నారంటూ 112కి కాల్ చేసిన ప్రభావతి పోలీసులను తప్పుదోవ పట్టించారు. స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసి.. ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. వెంకట్రావును కట్టేసి కొడుతుండగా.. కొందరు ఫోన్లో చిత్రీకరించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అసలు విషయం బయటపడింది.
దావులూరి ప్రభావతి, ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా కొట్టడంతో దోనవల్లి వెంకట్రావు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న వెంకట్రావును స్థానికులు 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రాడ్లు, కర్రలతో తీవ్రంగా గాయపరిచారని వెంకట్రావు భార్య, కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభావతిపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.