NTV Telugu Site icon

Perni Nani: కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ తనిఖీలపై పేర్ని నాని సెటైర్లు!

Perni Nani

Perni Nani

కాకినాడ పోర్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ వెళ్లిన బోటులో కస్టమ్స్, పోర్టు అధికారి ఇద్దరు ఉన్నారని.. అనుమతి ఇవ్వాల్సిన అధికారులు అక్కడే ఉండగా పర్మిషన్ ఇవ్వటం లేదని చెప్పటం ఏంటన్నారు. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం షిప్‌లో తనిఖీలు ఓ మంచి ప్రయత్నం అని, ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందించాలన్నారు. పవన్‌ను షిప్ ఎక్కడవద్దని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పి ఉండాలని, లేకపోతే పవన్ అబద్ధం చెప్పి ఉండాలని పేర్ని నాని సెటైర్లు వేశారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. కాకినాడ పోర్టులో పెద్ద ఎత్తున పేదల బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతున్న విషయంపై స్పందించారు.

‘కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షిప్‌లో తనిఖీలు ఓ మంచి ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందించాలి. ప్రాణాలకు తెగించి పవన్ చేసిన ఈ ప్రయత్నంపై కొన్ని అనుమానాలు ఉన్నాయి. తనను షిప్ ఎక్కడానికి అనుమతి ఇవ్వటం లేదని పవన్ చెబుతున్నారు. పవన్ వెళ్లిన బోటులో కస్టమ్స్, పోర్టు అధికారి ఇద్దరు ఉన్నారు. షిప్ ఎక్కడానికి అనుమతి ఇవ్వాల్సిన ఇద్దరు ఆయనతో ఉంటే.. అనుమతి ఇవ్వలేదని చెప్పటం ఏంటి?. ముందు రోజు కలెక్టర్ వెళ్ళటానికి అనుమతి ఇచ్చింది వారే కదా. పవన్‌ను షిప్ ఎక్కడవద్దని సీఎం చంద్రబాబు చెప్పి ఉండాలి. లేకపోతే పవన్ అబద్ధం చెప్పి ఉండాలి’ అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.

‘స్టెల్లా షిప్ సీజ్ చేయమని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అక్కడే కెన్ స్టార్ అనే మరో షిప్ కూడా ఉంది. కెన్ స్టార్ షిప్ సీజ్ చేయాలని పవన్ ఎందుకు అనలేదు. స్టెల్లాలో ద్వారంపూడి లేదా అతని తమ్ముడి బియ్యం కూడా లేవు. అయినా ఆ షిప్‌లో బియ్యంపై విచారణ చేయాలని కోరుతున్నాం. బియ్యం రవాణా విషయంలో చంద్రబాబు, పవన్ డ్రామా ఆడుతున్నారా?. కెన్ స్టార్ షిప్ యజమాని శ్రీను అనే వ్యక్తిది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు శ్రీను కాబట్టి దాని జోలికి వెళ్ళటం లేదు. శ్రీను ఒక్కడే 42 వేల టన్నుల పీడీఎస్ బియ్యం రవాణా చేస్తున్నారు. అందుకే పవన్ కళ్ళకు గంతలు కట్టుకుని కెన్ స్టార్ జోలికి వెళ్ళటం లేదు. కెన్ స్టార్ షిప్ మీదకు కూడా పవన్, కలెక్టర్ వెళ్ళాలి. కెన్ స్టార్ షిప్ మీదకు వెళ్లొద్దని పవన్ కి చంద్రబాబు చెప్పారా?. ఎందుకు వెళ్ళలేదో పవన్ సమాధానం చెప్పాలి. బియ్యానికి వైఎస్ జగన్‌కి, అరబిందో సంస్థకు ఏం సంబంధం?’ అని మాజీ మంత్రి ప్రశ్నించారు.