Gollapalli Surya Rao: అనుకున్నట్టే అయ్యింది.. టీడీపీకి దూరంగా జరిగి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు.. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ మేరకు రాజీనామా లేఖను పంపించారు.. ఆ లేఖలో తన రాజకీయ ప్రస్థానాన్ని మొత్తం రాసుకొచ్చారు.. 1981 నుంచి కొత్తపేట సమితి అధ్యక్షునిగా క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించాను.. స్వర్గీయ ఎన్టీఆర్ మరియు వైఎస్‌ఆర్ మంత్రివర్గాల్లో సభ్యునిగా రాష్ట్ర ప్రజలకు సేవలందించాను.. 2014 నుంచి 2019 వరకు శాసన సభ్యునిగా మీకు గానీ, పార్టీకి గాని ఏవిధమైన ఇబ్బంది కలిగించకుండా టీడీపీ గౌరవాన్ని నిలిపిన విషయం మీకు తెలుసు.. 2019 నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, రాజోలు నియోజకవర్గ ఇంచార్జ్‌గా ప్రతికూల పరిస్థితిలో కూడా రాష్ట్ర పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని నిబద్ధతో, క్రమశిక్షణతో అనుసరించి పార్టీ ప్రతిష్టను నిలబెట్టాను అంటూ లేఖ ద్వారా గుర్తు చేశారు గొల్లపల్లి..
Read Also: TDP: కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి టీడీపీ హైకమాండ్ నుంచి పిలుపు..
అయితే, మీరు 94 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో ప్రకటించి తొలి జాబితాలో.. నన్ను అభ్యర్థిగా ప్రకటించే అర్హతలు ఉన్నప్పటికీ నా పేరును పరిగణలోనికి తీసుకోకపోవడం నాకు అత్యంత బాధ కలిగించింది అంటూ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు గొల్లపల్లి సూర్యావు.. నా ఆత్మగౌరవానికి భంగం కలిగిన ఇటువంటి పరిస్థితిలో పార్టీలో కొనసాగలేనని నేను తెలుగుదేశం పార్టీ పదవులకు మరియు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. నా రాజీనామాను వెంటనే ఆమోదించవలసింది కోరుతున్నాను అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు.. కాగా, విజయవాడలోని కేశినేని భవన్‌లో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, ఎంపీ కేశినేని నానితో చర్చలు జరిపిన గొల్లపల్లి.. వైసీపీలో చేరేందుకు సిద్ధమైన విషయం విదితమే.. సీఎం వైఎస్ జగన్‌ను కలిసి ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు.