NTV Telugu Site icon

Asaduddin Owaisi: మీ గేదె పాలు ఇవ్వకపోయినా మాదే తప్పా?.. హిమంతకు ఒవైసీ కౌంటర్

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: అస్సాం ముఖ్యమంత్రి హిమంత భిస్వా శర్మ ముస్లిం వ్యాపారులపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ముస్లిం వ్యాపారుల్ని మియాలుగా సంబోధించిన హిమంత.. వారి వల్లే రాష్ట్రంలో కూరగాయల రేట్లు పెరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఓ మతం వారి వల్లే రేట్లు పెరుగుతున్నాయని సీఎం స్దానంలో ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడతారని అంతా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం స్పందించారు. పెరుగుతున్న కూరగాయల ధరలను ముస్లిం వ్యాపారులకు లింక్‌ చేస్తూ ఆరోపణలు చేస్తున్న అస్సాం సీఎంపై ఒవైసీ మండిపడ్డారు. బహుశా వారు తమ వ్యక్తిగత వైఫల్యాలను “మియా భాయ్”పై వేసి ఆరోపణలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు.

Also Read: Floods Effect: హిమాచల్‌లో వరుణ బీభత్సం.. రూ.2వేల కోట్లు మధ్యంతర సాయం కోరిన రాష్ట్రం

ముస్లిం కూరగాయల విక్రేతలు కూరగాయల ధరలను పెంచుతున్నారని, అస్సామీ ప్రజలు కూరగాయలు విక్రయిస్తే, వారు ఎక్కువ వసూలు చేయరని సీఎం శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారితీశాయి. కూరగాయల ధరలను ఇంతగా పెంచిన వ్యక్తులు ఎవరు? వారు మియా వ్యాపారులు, కూరగాయలు ఎక్కువ ధరకు అమ్ముతున్నారంటూ శర్మ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అలాగే స్ధానికంగా అస్సాంలో నివసించే బెంగాలీ ముస్లింలను మియాలుగా పేర్కొంటారు. వారిని ఉద్దేశించే హిమంత ఈ వ్యాఖ్యలు చేశారు. వారు బయటి వ్యక్తులని, అస్సామీ సంస్కృతి, భాషను వక్రీకరించడానికి వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

హిమంత భిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఒవైసీ.. వారి ఇళ్లలో గేదె పాలు ఇవ్వకపోయినా, కోడి తమ ఇంట్లో గుడ్లు పెట్టకపోయినా కూడా మియా భాయ్‌ ను నిందించేవారు పెరిగిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుశా వారు తమ ‘వ్యక్తిగత’ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మియా భాయ్‌ను నిందిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, విదేశీ ముస్లింలకు మధ్య లోతైన స్నేహం నడుస్తోందని ఏఐఎంఐఎం అధినేత ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ముస్లిం దేశాల్లో పర్యటిస్తున్న మోడీ.. అక్కడి నుంచి టమాటాలు, బచ్చలికూర, బంగాళదుంపలు మొదలైన వాటిని ఎగుమతి చేయాలని కోరాలన్నారు.

Also Read: Viral News: పొలం దున్నుతుండగా బయటపడిన పెట్టె.. తెరిచి చూసిన రైతు షాక్!

ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) చీఫ్, ధుబ్రీ ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ మాట్లాడుతూ.. మియా ముస్లింలు గౌహతిలో కూరగాయలు, మసాలా విక్రయించడానికి అనుమతించబోమని సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారని, సీఎం రాష్ట్రానికి అధినేత, ఆయన నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం సరికాదన్నారు. ఆయన అలా అనకూడదన్నారు. ఇది తనకు నచ్చలేదని బద్రుద్దీన్ అజ్మల్ తెలిపారు. ఇదంతా చేస్తూ ముస్లింలు, అస్సామీ ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని, ఇంత జరిగిన తర్వాత కూడా ఏదైనా సంఘటన జరిగితే దానికి ప్రభుత్వం, సీఎం శర్మ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

Show comments