Etala Rajender: అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తన పేరును ప్రస్తావించడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. డైట్ చార్జీలపై ఈటల సూచనలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈటలను సంప్రదించి వివరాలు తీసుకోవాలని మంత్రి హరీష్‌రావును ఆదేశించారు. కేసీఆర్ అలా అనడంపై ఈటల మాట్లాడుతూ.. సీఎం మాటలకు తాను పొంగిపోనని.. గతంలో జరిగిన అవమానాలను ఎన్నటికీ మర్చిపోనన్నారు. ఈటల అనే వ్యక్తి కేసీఆర్ మెతక మాటలకు పడిపోడంటూ స్పష్టం చేశారు. పలకరించుకుంటే, పక్కన కూర్చుంటే పార్టీలు మారే వ్యక్తిని కాదని అన్నారు. తనను డ్యామేజ్ చేసే వ్యూహంతోనే కేసీఆర్ అలా మాట్లాడారని అన్నారు.
Read Also: Sambani Chandrasekhar: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500లకే గ్యాస్
రకరకాల పద్దతుల్లో మమ్మల్ని హేళన చేశారని గుర్తు చేసుకున్నారు. ఇక అబద్దాన్ని అటూ చెప్పగలరు.. ఇటూ చెప్పగలరని ఈటల మండిపడ్డారు. టీఆర్ఎస్‌లో సైనికుడిగా పనిచేశా.. ఇప్పుడు బీజేపీలో కూడా అలానే పనిచేస్తానని ఎమ్మెల్యే ఈటల వెల్లడించారు. తాను బీఆర్‌ఎస్ పార్టీని వీడలేదని, వాళ్లే బయటకు పంపారని మరోసారి ఈటల గుర్తుచేశారు. కేసీఆర్ తన స్టైల్ లో మాట్లాడారని.. భట్టి, అక్బరుద్దీన్ ఒవైసీ, జగ్గారెడ్డి పేరును కూడా అలానే పిలుస్తారని తెలిపారు. మళ్ళీ పిలిచినా బీఆర్‌ఎస్‌లోకి వెళ్లనని స్పష్టం చేశారు. రెండు గంటల ప్రసంగంలో కేసీఆర్ పది సార్లకు పైగా ఈటల పేరు ప్రస్తావించారు. పదే పదే మిత్రుడు ఈటల రాజేందర్ చెప్పినట్లు అన్న కేసీఆర్, ఈటల పేరు ప్రస్తావించే సమయంలో ఘర్ వాపసీ అంటూ అసెంబ్లీలో సభ్యులు నినాదాలు చేశారు.