విత్తనాలు వేసుకునే శక్తి లేని వారు తన క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించండని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తాము విత్తనాలు అందిస్తాం అని, రైతులు ఖాళీ జాగా లేకుండా పంటలు వేయాలని కోరారు. రైతులకు ప్రభుత్వం తరఫున ఉచిత విద్యుత్, సాగునీరు, పెట్టుబడి సహాయం, మద్దతు ధర అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది మంచి వర్షాలు, పాడి పంటలతో తెలంగాణ దేశంలో అత్యధిక ఉత్పత్తులు ఎగుమతి చేసే రాష్ట్రంగా ఎదగాలని మంత్రి పొన్నం ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్లలో ‘ఏరువాక పౌర్ణమి’ సందర్భంగా పొలం దున్నే కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఎడ్ల నాగలితో దుక్కి దున్ని విత్తనాలు చల్లారు.
Also Read: WTC Final 2025: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్! 27 ఏళ్ల కల నెరవేరేనా?
పొలం దున్నే కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ‘రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. రైతులు ఒక్క గుంట కూడా బీడు లేకుండా.. వరి, మొక్కజొన్న, ఆయిల్ ఫాం ఇతర ఏదైనా పంటలు వేయాలి. రైతులు ఎక్కడ ఖాళీ జాగా, బీడు లేకుండా చూడాలి. రైతులకు ప్రభుత్వం తరఫున ఉచిత విద్యుత్, సాగునీరు, పెట్టుబడి సహాయం, మద్దతు ధర అందిస్తున్నాం. రైతులకు ఏ ఇబ్బంది లేకుండా రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉండే ప్రభుత్వం మాది. ఈసారి దేశంలో అధిక ఉత్పత్తులు ఎగుమతి చేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని ఆకాంక్షిస్తున్నా. విత్తనాలు వేసుకునే శక్తి లేని వారు నా క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించండి. మేము విత్తనాలు అందిస్తాం, మీరు ఖాళీ జాగా లేకుండా పంటలు వేయాలి. మొన్ననే హుస్నాబాదులో మూడు రోజుల పాటు రైతు మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ ప్రాంత రైతాంగానికి నూతన వ్యవసాయ విధానాలు, పద్ధతులపై మూడు రోజుల కాన్ఫరెన్స్ జరిగింది. పంటలు, యాంత్రీకరణ తదితర అంశాలపై రైతులు అవగాహన చేసుకున్నారు’ అని చెప్పారు.